నాగ శౌర్య ఛలోతో తెలుగులో డెబ్యూ చేసిన రష్మిక మందన్న చాలా తక్కువ టైంలో ఇంత స్టార్ డం వస్తుందని బహుశా ఊహించి ఉండదు. మూడేళ్ళ లోపే మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన ఆఫర్లు అందులోనూ సోలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టేయడం అంత ఈజీ కాదు. పైగా ఫెయిల్యూర్స్ పెద్దగా లేకుండా తన కెరీర్ కొనసాగుతోంది. ఏదో మొహమాటం కోసమో లేక ఇంకే కారణమో పొగరు లాంటి సినిమాలు తనకు పెద్దగా ఉపయోగం కలిగించకపోయినా అదెప్పుడో ఒప్పుకున్న మాతృ బాష కన్నడ మూవీ కాబట్టి దాని వల్ల కలిగిన డ్యామేజ్ తక్కువే. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ వైపు కూడా గట్టి కన్నే వేసింది.
హిందీలో తన మొదటి సినిమా మిషన్ మజ్ను కోసం ముంబైకు షిఫ్ట్ అయిన రష్మిక అక్కడే ఒక ఫ్లాట్ కూడా కొందట. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వికాస్ బహెల్ రూపొందించబోయే డెడ్లీలో ఆల్మోస్ట్ రష్మికనే ఓకే అయినట్టు మీడియా టాక్. ఒకవేళ నిజమైతే ఎక్కువ రోజులు ముంబైలో గడపాల్సి వస్తుంది. అందుకే తడిసి మోపెడయ్యే హోటల్ బిల్లుల కన్నా స్వంతంగా ఫ్లాట్ ఉంటే భవిష్యత్తులో ఎప్పటికైనా ఉపయోగమే కదానే ఆలోచనతో ఇలా సెట్ చేసుకున్నట్టు తెలిసింది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తరహాలో లేట్ గా కాకుండా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఇలా బాలీవుడ్ టార్గెట్ చేయడం మంచిదే.
కార్తీకి జోడిగా రష్మిక చేసిన మొదటి తమిళ సినిమా సుల్తాన్ ఎప్రిల్ 2న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ మీద రెండు భాషల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు శర్వానంద్ తో చేస్తున్న ఆడాళ్ళు మీకు జోహార్లు కూడా ఇదే ఏడాది రిలీజవుతుంది. మరో రెండు మూడు చర్చల దశలో ఉన్నాయి. డేట్ల సర్దుబాటు కాకపోవడం వల్లే ఆచార్యలో రామ్ చరణ్ సరసన అవకాశం వదులుకోవాల్సి వచ్చిన రష్మిక ఏక కాలంలో ఇటు సౌత్ అటు నార్త్ ఒకేసారి రెండు పడవల ప్రయాణం చేయాలని డిసైడ్ అయిపోయింది. ఒక్క ఫ్లాప్ నటీనటుల ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తున్న తరుణంలో ఈ మాత్రం జాగ్రత్త అవసరమే