iDreamPost
android-app
ios-app

టూ ఇన్ వన్ రాముడు/రాక్షసుడు – Nostalgia

  • Published Dec 30, 2020 | 12:10 PM Updated Updated Dec 30, 2020 | 12:10 PM
టూ ఇన్ వన్ రాముడు/రాక్షసుడు – Nostalgia

దర్శకరత్న దాసరినారాయణరావు గారితో చేయని అగ్ర హీరోలు పరిశ్రమలో బహుశా లేరని చెప్పొచ్చు. స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి రాజశేఖర్ దాకా అందరితోనూ మర్చిపోలేని సినిమాలు ఎన్నో అందించారు. అయితే 1991 దాకా సుమన్ తో ఈయన కాంబినేషన్ సాధ్యం కాలేదంటే ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ ఇది నిజం. 1973లో తాత మనవడుతో దాసరి కెరీర్ మొదలుపెట్టాక మధ్యలో ఎక్కడ సుమన్ తో కాంబో కార్యరూపం దాల్చలేదు. దానికి శ్రీకారం చుట్టారు నిర్మాత అట్లూరి రాధాకృష్ణమూర్తి. రాధ, భానుప్రియ హీరోయిన్లుగా రాజ్ కోటి సంగీతంలో చెన్నై విజయా గార్డెన్స్ లో ‘రాముడు కాదు రాక్షసుడు’ షూటింగ్ అట్టహాసంగా మొదలుపెట్టారు. మొదటిరోజే టైటిల్ ప్రకటించారు.

అనాథ అయిన భార్గవ్(సుమన్)చిన్నతనంలోనే విలన్ల దుర్మార్గం వల్ల తల్లి జైలు పాలయ్యి తండ్రిని కోల్పోతాడు. అప్పటి నుంచి తాను అనుకున్నది చేస్తూ ఎవరినీ లెక్కచేయకుండా ఓ పాత బంగాళాను అడ్డాగా మార్చుకుంటాడు. ఇతన్ని పట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇన్స్ పెక్టర్(రాధ) అన్నంత పని చేసి జైల్లో వేస్తుంది. ప్రతీకారంగా భార్గవ్ ఆమెను మానభంగం చేస్తాడు. అప్పటికే భార్గవ్ మీద మనసు పారేసుకున్న లేడీ జర్నలిస్ట్(భానుప్రియ)తన ప్రేమను త్యాగం చేస్తుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత రాధ క్లైమాక్స్ లో బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూస్తుంది. భార్గవ్ చేతిలో దుర్మార్గుల సంహారం ముగుస్తుంది.

1991 ఫిబ్రవరి 14న భారీ అంచనాల మధ్య రాముడు కాదు రాక్షసుడు రిలీజయింది. గతంలో అక్కినేనితో దాసరి తీసిన రాముడు కాదు కృష్ణుడు, రావణుడే రాముడైతే సెంటిమెంట్ ని దీనికి కూడా టైటిల్ పరంగా వాడుకున్నారు. ఆశించినంత పెద్ద స్థాయిలో సినిమా ఆడలేదు. సుమన్ లాంటి సాఫ్ట్ హీరోని అంత నెగటివ్ షేడ్స్ లో చూపడం. పోలీసైన హీరోయిన్ని రేప్ చేయడం, చివర్లో ఆమె చనిపోవడం లాంటివి మరీ నాటకీయంగా అనిపించాయి. బిసి సెంటర్స్ లో కమర్షియల్ గా బాగానే వర్కౌట్ అయ్యింది. మ్యూజికల్ గానూ పాటలు జస్ట్ ఓకే అనిపించాయి అంతే. కర్తవ్యంతో పేరు తెచ్చుకున్న పుండరీకాక్షయ్య, అంకుశం రామిరెడ్డి మెయిన్ విలన్లుగా నటించారు.