iDreamPost
iDreamPost
నిన్న సాయంత్రం విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దన్న ట్రైలర్ ఆన్ లైన్ లో బాగానే దూసుకుపోతోంది. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ విలేజ్ కం అర్బన్ డ్రామాలో తలైవా ఊర మాస్ క్యారెక్టర్ లో విశ్వరూపంలో చూపించినట్టు క్లారిటీ వచ్చేసింది. అయితే వీడియోలో చెప్పిన పాయింట్, చూపించిన అంశాలు రొటీన్ గానే అనిపించడం కొంత అనుమానం కలిగిస్తోంది. ఊరికి పెద్ద, అతనికో గారాల చెల్లెలు, పెళ్లి చేసి అత్తారింటికి పంపించాక ఆమె లైఫ్ రిస్క్ లో పడటం, దీంతో పెద్దన్న నగరానికి వచ్చి విలన్ల భరతం పట్టడం, వాళ్ళకో మాఫియా కనెక్షన్ ఉండటం ఇవన్ని గతంలో ఎన్నో సార్లు చూసేసి అరిగిపోయిన ఫార్ములానే.
మరి స్క్రీన్ మీద రజని ఎలాంటి మేజిక్ చేస్తాడో వేచి చూడాలి. మీనా ఖుష్బూ నయనతార ముగ్గురినీ రజనికి జోడిగా సెట్ చేసినట్టు ఉన్నారు. ఇక్కడ చిరంజీవికి చెల్లెలుగా భోళాశంకర్ లో కనిపించనున్న కీర్తి సురేష్ ఇందులో రజని సోదరిగా కనిపించడం విశేషం. జగపతిబాబు ఎప్పటిలాగే అలవాటైన విలనీలో చెలరేగిపోయాడు. దర్శకుడు శివ సాధారణంగా పాత కథలనే తిప్పి తిప్పి తీసి కమర్షియల్ సక్సెస్ లు కొడుతూ ఉంటాడు. విశ్వాసం దానికి మంచి ఉదాహరణ. ఎంత రొటీన్ గా ఉన్నా కూడా యాక్షన్ ని ఎమోషన్ ని బాలన్స్ చేస్తాడు కాబట్టి స్టార్ హీరోలు వెంటపడి మరీ అవకాశాలు ఇస్తూ ఉంటారు.
సో పెద్దన్న తెలుగులో ఏ రేంజ్ వసూళ్లు చేస్తాడో చూడాలి. గతంలో ఆయన సినిమాల్లో దేనికీ లేనంత తక్కువగా కేవలం 12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. 4న మారుతీ మంచి రోజులు వచ్చాయి, 5న సూర్యవంశీ పోటీలో ఉన్నాయి కాబట్టి పరుగు అంత సులభం కాదు. ఇక్కడ ఎలా ఉన్నా తమిళనాడులో రికార్డులు బద్దలు కావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నూటా యాభై కోట్ల గ్రాస్ మంచి నీళ్ల ప్రాయమని అక్కడి ట్రేడ్ పండితులు అంచనా. ఇమ్మాన్ సంగీతం అందించిన పెద్దన్న తమిళ వెర్షన్ కు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రమణ్యం తన చివరి పాట పాడటం విశేషం.
ALSO READ – Pawan Kalyan: పవర్ స్టార్ సరసన కొత్తమ్మాయా