సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రి పాలవడం చర్చనీయంశంగా మారింది. దానికి కారణం గత ఏడాది కరోనా సమయంలో అపోలో ఆసుపత్రిలో ఆయన చేరి చావు అంచుల దాకా వెళ్లి రావడమే. దీంతో ఆయన మళ్ళీ హాస్పిటల్ లో చేరారు అనగానే అభిమానులు అందరూ టెన్షన్ పడ్డారు. ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆయన అనారోగ్య కారణాలతో హాస్పిటల్ లో చేరారని ముందు ప్రచారం జరిగినా సాధారణ వైద్య పరీక్షల కోసమే చేరారని రజనీ సన్నిహితుల ద్వారా వెల్లడి అయింది. సాధారణ చికిత్సలో భాగంగా ఆస్పత్రిలో చేరినట్లు రజనీకాంత్ సన్నిహితులు తెలుపగా రజనీకాంత్ క్షేమంగా ఉన్నారని, హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆయన ఆస్పత్రిలో చేరారని లతా రజనీకాంత్ కూడా వెల్లడించారు.
అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం కోసం ఒక రోజు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు. అయితే తాజాగా చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు రజినీకాంత్ హెల్త్ బులిటెన్ ని విడుదల చేశారు. దాని ప్రకారం నిన్న అల్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రిలో రజనీకాంత్ చేరారని, ఆయనని పరీక్షించిన వైద్యుల బృందం కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ చేయాలని సూచించారని, వైద్యుల సూచనల మేరకు ఆ చికిత్స ఈరోజు విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పేర్కొంది. రజినీకాంత్ ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
ఆయన హీరోగా నటిస్తున్న పెద్దన్న సినిమా షూటింగ్ పూర్తి కాగా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఆయన తన కుమార్తె సౌందర్య కొత్తగా ప్రారంభించిన వాయిస్ యాప్‌లో హాస్పిటల్ లో చేరడానికి ముందు ఒక వాయిస్ నోట్‌ను షేర్ చేశారు. వాయిస్ నోట్ లో రాబోయే దీపావళి రోజున విడుదల కానున్న తన అన్నాత్తే సినిమాను మనవడు వేద్ కృష్ణ, కుటుంబ సభ్యులతో కలిసి చూస్తాననీ చెప్పుకొచ్చారు.ఇక గతేడాది షూటింగ్ సమయంలో కూడా అనారోగ్యం పాలయ్యారు సూపర్ స్టార్. వారం రోజుల పాటు చికిత్స తీసుకుని ఆ తర్వాత చెన్నై వెళ్లి విశ్రాంతి తీసుకున్న తర్వాత అమెరికా చెకప్ కోసం కూడా వెళ్ళారు.
కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ అంటే?
రివాస్క్యులరైజేషన్ అనేది రక్త ప్రసరణను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన శస్త్రచికిత్స. హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగుల జీవిత నాణ్యత మరియు జీవితకాలాన్ని మెరుగుపరచడంలో ఇటీవలి సంవత్సరాలలో ఈ పునర్వ్యవస్థీకరణ దోహదపడింది.