iDreamPost
android-app
ios-app

త్వరలో రాజకీయ పార్టీ,యువతకే ప్రాధాన్యత-రజినీకాంత్

త్వరలో రాజకీయ పార్టీ,యువతకే ప్రాధాన్యత-రజినీకాంత్

అన్ని పార్టీల్లోనూ పార్టీ అధినేతలే ముఖ్యమంత్రులుగా పదవులు చేపడుతున్నారని, కానీ తనకు సీఎం అవ్వాలన్న ఆశ,వ్యామోహం లేదని రజినీకాంత్ మీడియా సమావేశంలో స్పష్టం చేసారు. చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజినీకాంత్ మాట్లాడుతూ తమిళనాట నెలకొన్న రాజకీయ పరిస్థితులను గురించి మాట్లాడారు.

మీడియా సమావేశంలో రజినీకాంత్ మాట్లాడుతూ రాజకీయాల్లోకి వస్తానని రెండేళ్ల క్రితమే చెప్పానని గుర్తుచేస్తూ తమిళనాడులో జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కువశాతం వృద్ధులే ఉన్నారని,కానీ తాను పెట్టబోయే రాజకీయ పార్టీలో 60-65% యువతకే పెద్దపీట వేస్తానని రజినీకాంత్ వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా తమిళనాడులో రాజకీయ పరిస్థితులను గమనిస్తున్నానని త్వరలో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని తెలిపారు.

పార్టీలో యువతకే ప్రాధాన్యత ఇస్తామని, తాను పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని, విద్యాధీకుడైన యువకుడినే సీఎం చేస్తానని రజనీకాంత్ మీడియా సమావేశంలో తెలిపారు. తనకు సీఎం పదవిపై వ్యామోహం లేదని,ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలకే ఎందుకు రాజకీయ అవకాశాలు వస్తున్నాయని ప్రశ్నించిన రజిని తన పార్టీలో యువతకు అవకాశం కల్పిస్తానని స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ పేరును విధి విధానాలను ప్రకటిస్తానని రజినీకాంత్ పేర్కొన్నారు. డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలకు వ్యతిరేకంగానే తన పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా రజినీకాంత్ వ్యాఖ్యానించారు.

కాగా 2021 ఏప్రిల్ లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.కేవలం సంవత్సరం మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో రజినీకాంత్ ఆ ఎన్నికలకు సమాయత్తం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.