iDreamPost
android-app
ios-app

రూటు మారిన రాజ‌స్థాన్ రాజకీయం : రాజ్ భవన్ తో సీఎం ఢీ

రూటు మారిన రాజ‌స్థాన్ రాజకీయం : రాజ్ భవన్ తో సీఎం ఢీ

అనర్హత పిటిషన్ కి సంబంధించి కోర్టు తీర్పు సచిన్ పైలట్ వర్గానికి అనుకూలంగా రావడం.., న్యాయ పరంగా మరిన్ని చిక్కులు ఎదురవుతుండడం వల్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్.. ఇక అసెంబ్లీ సాక్షిగా తాడో పేడో తేల్చు కోవడానికి సిద్దం అయ్యారు.

సోమవారం నాటికి అసెంబ్లీ ని హాజరు పరిచేందుకు ఉత్తర్వులు ఇవ్వాల్సిందే అని గవర్నర్ ని పట్టుబడుతున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే లతో కలిసి ఏకంగా రాజ్ భవన్ వద్ద బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ని ఉద్దేశించి అశోక్ గెహ్లోత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు తక్షణం నిర్ణయం తీసుకోకపోతే.. ప్రజలు రాజ్ భవన్ ని ముట్టడించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అదే జరిగితే తామేమీ చేయలేమని చెప్పారు. సమస్య పరిష్కారాన్ని కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.

రాత్రికి రాత్రి సమావేశ పరచలేం..

అశోక్ గెహ్లోత్ వ్యాఖ్యలకు గవర్నర్ కూడా.. తీవ్రంగానే బదులిచ్చారు. రాజ్ భవన్ కి సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితి పై ఓ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం తానెక్కడా చూడలేదన్నారు. సమావేశాలకు 21 రోజుల నోటీస్ పీరియడ్ తప్పని సరి అని, రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకోలేమని చెప్పారు. మొత్తం మీద ఈ వ్యవహారం మలుపులు తిరుగుతూ.. సీఎం, గవర్నర్ ల మధ్య పోరుగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మధ్యప్రదేశ్ లో మార్పులకు ముందు ఇలాగే జరిగిందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన రాజకీయాలు వేరు.. ఇకపై రాజకీయ పోరు కొత్తగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

తాజాగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్.. గవర్నర్ ని టార్గెట్ చేయడంతో… ఇక బీజేపీ పెద్దలు కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి అమిత్ షా నివేదిక తెప్పించి కుని బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు తెలిసింది. గవర్నర్ వ్యాఖ్యలను బట్టి సోమవారం అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అదే జరిగితే అశోక్ గెహ్లోట్ వర్గం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎక్కువ కాలం ఎమ్మెల్యేలను కాపాడు కోవడం సాధ్యం కాదని భావించి సీఎం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయి అనేది సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.