Idream media
Idream media
రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న చీలిక కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న తరుణంలో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆది నుంచి ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ నేతలు ఈ రోజు మరో విమర్శ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలలో మంతనాలు జరిపారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు గజేంద్రసింగ్ షేకావత్‌పై కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు బీజేపీ ఎమ్మెల్యే శర్మ, బీజేపీ నేత సంజయ్ జైన్‌ల టెలిఫోన్ సంభాషణలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు.
అవకాశం వస్తే రాజస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఓం మాథుర్.. ఇటీవల ఓ కీలక వ్యాఖ్య చేశారు. ఒక వేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అవుతారని ఆయన పేర్కొన్నారు. వంసుధర రాజే కన్నా అందరికీ అమోద్యయోగ్యమైన నేతగా, అందరినీ కలుపుకునిపోయే నాయకుడైన షేకావత్‌కు ఆ అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించడం తాజాగా జరిగిన పరిణామం నేపథ్యంలో చర్చనీయాంశమైంది.
మరోవైపు తనతోపాటు తన వర్గ ఎమ్మెల్యేలు 19 మందిపై కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు అనర్హత వేటు వేస్తూ స్పీకర్ జారీ చేసిన నోటీసులపై సచిన్ పైలెట్ దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు హైకోర్టులో విచారణకు రానుంది. ఈ క్రమంలో తాజా పరిణామం సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. పైలెట్ వర్గంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్ ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసింది. నయానో, భయానో సచిన్ పైలెట్ వర్గంలోని ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తన వద్ద ఉన్న అస్త్రాలను ఒక్కక్కటిగా ప్రయోగిస్తోంది.