iDreamPost
android-app
ios-app

Cabinet Reshuffle – కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. అసమ్మతికి చెక్ పడినట్లే

  • Published Nov 21, 2021 | 10:56 AM Updated Updated Nov 21, 2021 | 10:56 AM
Cabinet Reshuffle –  కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. అసమ్మతికి చెక్ పడినట్లే

ఏడాదికిపైగా అదిగో ఇదిగో అంటున్న రాజస్థాన్ కేబినెట్ ను ఎట్టకేలకు పునర్వ్యవస్థీకరించారు. మొదట మంత్రివర్గ విస్తరణ అనుకున్నా.. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పూర్తిగా ప్రక్షాళన చేశారు. కేబినెట్లో మొత్తం 30 మందిని చేర్చుకునేందుకు అవకాశం ఉండగా.. సీఎం తప్ప మిగతా మంత్రులందరి చేతా రాజీనామా చేయించారు. పాత మంత్రివర్గంలోని 18 మందితోపాటు కొత్తగా 12 మందికి అవకాశం కల్పించారు. వీరిలో అసమ్మతి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఐదుగురు ఉన్నారు. గత ఏడాది జూలైలో సచిన్ పైలట్ తన వర్గానికి చెందిన 18 మందితో సీఎం అశోక్ గెహ్లోట్ నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో పైలట్ తోపాటు ఆయన వర్గీయులైన ఇద్దరు మంత్రులను అప్పట్లో తొలగించారు. అప్పటినుంచీ గెహ్లోట్, పైలట్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. చివరికి గత వారం వారిద్దరిని ఢిల్లీ పిలిపించి స్వయంగా సోనియాగాంధీ రాజీ కుదర్చడంతో మంత్రివర్గ ప్రక్షాళనకు మార్గం సుగమం అయ్యింది. రాజీ సూత్రంలో భాగంగానే సచిన్ వర్గానికి కేబినెట్లో 5 పదవులు ఇచ్చారు.

కొత్త మంత్రులు వీరే..

ప్రస్తుత కేబినెట్లో 21 మంది మంత్రులు ఉండగా.. పార్టీ పదవులు చేపట్టిన ముగ్గురు మంత్రులు నిన్న రాజీనామా చేయడంతో మంత్రుల సంఖ్య 18కి తగ్గింది. కొత్తగా 12 మందికి అవకాశం కల్పించారు. పాత వారిలో నలుగురు సహాయ మంత్రులకు పదోన్నతి కల్పించారు. కొత్త మంత్రుల జాబితాను పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కేబినెట్ మంత్రులుగా హేమరాం చౌదరి, మహేంద్రజిత్ సింగ్ మాలవ్య, రాంలాల్ జాట్, మహేష్ జోషి, విశ్వేన్ద్ర సింగ్, రమేష్ మీనా, మమత భూపేష్ భైర్వా, భజన్ లాల్ జాతవ్, తికారాం జూలీ, గోవింద్ రామ్ మేఘవాల్, శకుంతల రావత్ నియమితులయ్యారు. జహీదా ఖాన్, బ్రిజేంద్ర సింగ్ వోలా, రాజేంద్ర బుదా, మురారీలాల్ మీనా సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. వీరిలో హేమరామ్ చౌదరి, విశ్వేన్ద్ర సింగ్, మురారీలాల్ మీనా, రమేష్ మీనా, బ్రిజేంద్ర వోలా సచిన్ పైలట్ వర్గీయులు. గత ఏడాది సచిన్ పైలట్ తోపాటు పదవులు కోల్పోయిన ఇద్దరు మళ్లీ మంత్రి పదవులు దక్కించుకున్నారు. కొత్త మంత్రులు ఈ రోజు సాయంత్రం రాజ్ భవన్లో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు.

2023 ఎన్నికల టీమ్

పంజాబ్ చేదు అనుభవాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అలకలు, అసంతృప్తులకు తావు లేకుండా.. గెహ్లోట్ సచిన్ మధ్య మళ్లీ విభేదాలకు అవకాశం ఇవ్వరాదన్న ఉద్దేశంతో మంత్రుల జాబితాను తానే ఖరారు చేసింది. సచిన్ పైలట్ కు ఇచ్చిన హామీ మేరకు ఆయన వర్గానికి సముచిత ప్రాతినిథ్యం కల్పించింది. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ జాబితాను ఖరారు చేశారు. కేబినెట్లో తొలిసారి ఎస్సీ వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు. ఎస్టీలకు మూడు, ముస్లిం మహిళకు ఒక పదవి ఇచ్చారు. మొత్తం మీద కేబినెట్లో ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చారు. కాగా బీఎస్పీ నుంచి ఇటీవలే కాంగ్రెసులో చేరిన ఎమ్మెల్యే రాజేంద్ర బుదాకు కూడా కేబినెట్లో చోటు కల్పించడం విశేషం.

Also Read : Mamata KCR Modi-అప్పుడు మ‌మ‌త‌.. ఇప్పుడు కేసీఆర్‌..!