iDreamPost
android-app
ios-app

సానుకూలంగా వర్షాలు, ఆ జిల్లాల్లో కూడా లోటు వర్షపాతం నుంచి గట్టెక్కుతున్నట్టే

  • Published Jul 11, 2021 | 9:38 AM Updated Updated Jul 11, 2021 | 9:38 AM
సానుకూలంగా వర్షాలు, ఆ జిల్లాల్లో కూడా లోటు వర్షపాతం నుంచి గట్టెక్కుతున్నట్టే

ఆంధ్రప్రదేశ్ లో గడిచిన రెండు సీజన్లలో అనుకూలంగా వాతావరణ పరిస్థితులున్నాయి. మిగులు వర్షపాతం నమోదయ్యింది. ప్రధాన నదులకు వరదలు వచ్చాయి. గోదావరి, కృష్ణాతో పాటుగా పెన్నా సహా దాదాపు అన్ని నదులు నిరుడు ఉప్పొంగాయి. దాంతో ప్రాజెక్టులు నిండాయి. పంటలు సుభిక్షంగా పండాయి. ధాన్యం సహా అన్నింటా దిగుబడులు పెరిగాయి. కానీ ఈ ఏడాది ఆశాజనకంగా మొదలయినప్పటికీ ప్రస్తుతం లోటు వర్షపాతమే కనిపిస్తోంది. రాయలసీమలోని మూడు జిల్లాలు మినహా రాష్ట్రమంతా సాధారణ వర్షపాతం కన్నా తక్కువగానే నమోదవుతోంది.

కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సగటు వర్షపాతం కన్నా ఎక్కువగా నమోదయ్యింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 11 వరకూ కడపలో ఏకంగా 54 శాతం అధికంగా వర్షపాతం నమోదయితే అనంతలో 42 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. చిత్తూరులో కూడా అధికవర్షపాతం నమోదు కావడం విశేషం. ఆ తర్వాత కర్నూలు, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదయ్యింది. కానీ మిగిలిన ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటుగా కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదయ్యింది. అందులో నెల్లూరు లో 31 శాతం, గుంటూరులో 30 శాతం తక్కువగా నమోదయ్యింది.

తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈసారి గోదావరి, కృష్ణా వరదలు కూడా ఆశించినంతగా కనిపించడం లేదు. గత ఏడాది జూలై రెండోవారంలో గోదావరి ఉప్పొంగింది. కానీ ప్రస్తుతం వరద సాధారణ స్థితిలోనే ఉంది. ఇక కృష్ణా లో కూడా ఎగువ నుంచి ఇన్ ఫ్లో స్ లేకపోయినా ప్రకాశం బ్యారేజ్ నుంచి జలాలు సముద్రం పాలుకావాల్సిన పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. సోమశిల ప్రాజెక్టులోకి ఇప్పుడిప్పుడు కొత్త నీరు వచ్చి చేరుతోంది.

ఇప్పటికే వర్షాలు సరిగా లేకపోవడంతో వ్యవసాయ సీజన్ ఆలశ్యమవుతోంది. కానీ ప్రస్తుతం మళ్లీ ఆశలు రేపేలా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో ఆనందం కనిపిస్తోంది. మళ్లీ సాగు పనులు జోరందుకునే అవకాశం ఏర్పడుతోంది. రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో కూడా సాధారణ స్థితికి చేరుకుంటాయనే అభిప్రాయం బలపడుతోంది. రాష్ట్ర సగటు 141 మి. మీలకు గానూ ప్రస్తుతం 128 మి.మీ. వర్షపాతం నమోదుకావడంతో ప్రస్తుత వర్షాల కారణంగా ఈ పది శాతం లోటు కూడా పూడుకుపోతుందని భావిస్తున్నారు.

Also Read : శాసనమండలి నుంచి సీఎంలు..1952 నుంచే ఆ సంప్రదాయం