iDreamPost
android-app
ios-app

ఇకపై రైలు ప్రమాదాలకు చెక్-నూతన వ్యవస్థను రూపొందించిన రైల్వేశాఖ

ఇకపై రైలు ప్రమాదాలకు చెక్-నూతన వ్యవస్థను రూపొందించిన రైల్వేశాఖ

ఇకపై వివిధ కారణాల వల్ల జరిగే రైలు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ రంగం సిద్ధం చేసింది. రైలు ప్రమాదాలను ముందుగా పసిగట్టి నివారించే టికాస్ అనే కొత్త సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముందుగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ డివిజన్‌ పరిధి సికింద్రాబాద్‌ – ముద్కేడ్‌ సెక్షన్‌లోని ఉమ్రి – సివున్‌గావ్‌ స్టేషన్ల మధ్య అందుబాటులో ఉంచింది.

టికాస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

టికాస్‌ (ట్రైన్‌ కొలిజన్‌ అవాయిడెన్స్‌ సిస్టమ్‌) వ్యవస్థను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందులో భాగంగా ప్రత్యేకమైన ట్యాగులను రైలు పట్టాల మధ్యలో అమరుస్తారు. ట్రాక్ పక్కనే ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేశారు. ఈ ట్యాగులు ప్రతి రైలు వేగాన్ని,పట్టాలపై వచ్చే రైళ్లను మానిటర్ చేస్తూ ఉంటాయి. వీటిని లోకో పైలట్ క్యాబిన్‌ కు అనుసంధానిస్తారు.

ఏదైనా ఆపద సమయంలో రైలు డ్రైవరు బ్రేకులు వేయకపోయినా, సిగ్నల్‌ను ప్రమాదకరంగా దాటినా, నిర్దేశించిన వేగానికి మించి రైలు వేగంగా దూసుకుపోయినా, ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా టికాస్ వ్యవస్థ హెచ్చరిస్తుంది..టికాస్ హెచ్చరికలు పరిగణనలోకి తీసుకుని లోకో పైలట్ అప్రమత్తమయ్యి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవచ్చు.

ఎక్కడ పరీక్షించారు?

పూర్తిస్థాయి దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన టికాస్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా లింగంపల్లి-వికారాబాద్‌, వాడి, వికారాబాద్‌-బీదర్‌ సెక్షన్ల మధ్య పరీక్షించారు. ఈ పరీక్షలు సత్ఫలితాలు ఇవ్వడంతో హైదరాబాద్‌ డివిజన్‌ పరిధి సికింద్రాబాద్‌ – ముద్కేడ్‌ సెక్షన్‌లోని ఉమ్రి – సివున్‌గావ్‌ స్టేషన్ల మధ్య అందుబాటులోకి తీసుకువచ్చారు. దేశంలో టికాస్ వ్యవస్థను మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఘనత దక్షిణ మధ్య రైల్వేకేదక్కింది. ప్రస్తుతం మన్మాడ్‌-నాందేడ్‌-సికింద్రాబాద్‌-డోన్‌-గుంతకల్‌, బీదర్‌-పర్బని సెక్షన్ల మధ్య 1,200 కిమీ పొడవునా టి కాస్‌ వ్యవస్థ చేపట్టేందుకు రైల్వేశాఖ అనుమతులు మంజూరుచేసింది.ప్రమాదాలను నివారించేందుకు రైల్వేశాఖ చేపడుతున్న ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తాయని రైల్వేశాఖ ఆశాభావం వ్యక్తంచేసింది.