Idream media
Idream media
గొప్ప వంట వాళ్లంతా ఏకమైతే ఒక్కోసారి వంటలు పూర్తిగా చెడిపోతాయి. దీనికి ఉదాహరణ 1967లో వచ్చిన రహస్యం దర్శకుడు వేదాంతం రాఘవయ్య, మాటలు స్క్రీన్‌ప్లే సదాశివబ్రహ్మం, సంగీతం ఘంటశాల, హీరోలు అక్కినేని, కాంతారావు, హీరోయిన్లు కృష్ణకుమారి, బి.సరోజ. అందరూ కలిసి ప్రేక్షకుల్ని పారిపోయేలా చేశారు. ఇక నిర్మాత మామూలోడు కాదు. లవకుశ తీసిన శంకర్‌రెడ్డి.
ఈ సినిమా మీద చిన్నప్పుడే నాకు గట్టి అభిప్రాయం ఏర్పడింది. మా నాన్న బాగానే సినిమాలు చూసేవాడు. రహస్యం పేరు చెబితే చాలు భయంకరమైన తలనొప్పిరా అనే వాడు. తెరమీద బొమ్మలు కనిపిస్తే చాలు ఆనందంగా చూసే ఆయనే ఆ మాట అన్నాడంటే , ఇక ఆ సినిమా ఏంటో ఊహించుకోవచ్చు. చిన్నప్పుడు టెంట్‌లలో అప్పుడప్పుడు తగిలినా నేను చూడలేదు. దీనికి కారణం ANR కత్తి పట్టుకుంటే ఎఎన్నారే భయపడతాడు. అంత ఘోరంగా ఉంటుంది. రహస్యం ఏ స్థాయి డిజాస్టర్ అంటే మళ్లీ జానపద హీరోగా నటించడానికి నాగేశ్వరరావు ఎప్పుడూ ధైర్యం చేయలేదు.
కరోనా వల్ల రోజులు బాగాలేక ఈ మధ్య యూట్యూబ్‌లో చూశాను. స్టార్ట్ కావడమే SV. రంగారావు ఒక పాట ఎత్తుకున్నాడు. అయిపోతానే కొంత మంది జూనియర్ డ్యాన్సర్లు లలితాంబని పూజిస్తూ పాట పాడారు. హమ్మయ్య అనుకుంటే నారదుడు మొదలు పెట్టాడు. పాటలు, పద్యాలు కలిసి మొత్తం 28 ఉంటే ఇక జనం పారిపోక ఏమవుతారు?
ఈ సినిమాకి రహస్యమని కాకుండా , లలితాంబ మహత్యం అని పెడితే బాగుండేది. అసలు ఈ సినిమాలో రహస్యం కూడా ఏమీ లేదు. మనం టైటిల్ మరిచిపోకుండా ఉండడానికి రెండు మూడు సీన్లకి ఒకసారి ఎవరో ఒకరు అదా రహస్యం? అంటూ ఉంటారు. వేదాంతం , సదాశివబ్రహ్మ కలిసి ఈ తుక్కు సినిమాని ఎలా తీసి ఉంటారా? అని ఆశ్చర్యం. వాళ్లు తీసినా నాగేశ్వరరావు ఎందుకు ఒప్పుకుని ఉంటాడో?
జానపద సినిమాలో ఎన్టీఆర్ కత్తి పట్టుకుని దూసుకెళుతున్న రోజులు. ANR వచ్చిందే జానపద హీరోగా (బాలరాజు, కీలుగుర్రం). మళ్లీ కత్తి పట్టుకుని దూసుకెళుదామని అనుకుని ఉంటారు. తమాషా ఏమంటే ANR కత్తి యుద్ధం చేస్తుంటే డ్యాన్స్‌లకి స్టెప్పులేస్తున్నట్టుంటుంది.
హీరోయిన్ల పరిచయమే కృష్ణకుమారి అంధురాలిగా, బి.సరోజ వికలాంగురాలిగా కనిపిస్తుంది. తర్వాత విముక్తి లభిస్తుంది (ప్రేక్షకులకు).
రమణారెడ్డి ఉన్నాడు, ఏదో నవ్విస్తాడనుకుంటే ఆయన కూడా పద్యాలు పాడుతాడు. అయితే ఇప్పుడు బాహుబలిలా, ఆ రోజుల్లో అద్భుతమైన సెట్టింగ్‌లు వేశారు. అవి కనపడడం కోసమే కలర్‌లో తీశారు. సినిమా అంతా హైదరాబాద్‌లో తీశారు. లలిత శివజ్యోతి స్టూడియో ఎక్కడుండేదో తెలియదు.
ఈ సినిమా తర్వాత శంకర్‌రెడ్డి మళ్లీ పదేళ్లు సినిమా తీయలేదు. 1977లో ఎన్టీఆర్, వాణిశ్రీలతో సతీసావిత్రి తీసి పూర్తిగా నష్టాలపాలయ్యాడు.
తెలివైన వాళ్లు కూడా తప్పులు చేయడం సినిమా ఫీల్డ్‌లో కొత్త కాదు. వెనుకటికి విజయా వాళ్లు చంద్రహారం తీస్తే జనం గుర్రు పెట్టి నిద్రపోయారు.
నిర్మాత సిప్పీ షోలే తర్వాత తన జీవిత కాలంలో అలాంటి సినిమా తీయలేకపోయాడు. లవకుశ తర్వాత శంకర్‌రెడ్డి కూడా అంతే.
సినిమాలకైనా, జీవితంలోనైనా మ్యాజిక్ రిపీట్ కాదు.