iDreamPost
iDreamPost
తన రొఢ్ఢ కొట్టుడు రాతలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో రాయలసీమ జనాన్ని, ఉద్యోగులను టార్గెట్ చేశారు. ప్రతి అక్షరంలో ప్రభుత్వంపై అక్కసును వెళ్లగక్కారు. ప్రభుత్వంపై ఇంకా తిరగబడడం లేదేమని ఈసారి ప్రజలతోపాటు మేధావులకు శాపనార్థలు పెట్టారు. పనిలో పనిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎలా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలో సలహా కూడా విసిరారు.
రాయలసీమ పౌరుషంపై కలం తొక్కుతూ..
రాయలసీమ ఎత్తిపోతల పథకం ముందుకు సాగటం లేదని, కేంద్ర ఆర్థిక సంస్థలు అప్పులు ఇవ్వడం లేదని, అందుకు కారణం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అని నిర్థారణ చేసేశారు. అలాంటప్పుడు సీమ సింహాలు అని పేరు పడ్డవారు ఏమి చేస్తున్నారు అంటూ ఆవేశ పడిపోయారు. రాయలసీమ ప్రజలు రాగి సంగటి, కోడి పులుసు తినేసి ఊరుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని రాసేసి వారిలో పౌరుషం రగిలించానని మురిసిపోయారు.
మహిళలకు చప్పట్లు కొట్టడం ఇష్టం లేదట!
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సభల్లో చప్పట్లు కొట్టడానికి మహిళలు అస్సలు ఇష్టం పడడం లేదని, అందుకు మొన్న గురువారం ఒంగోలులో జరిగిన ఆసరా సభ తార్కాణం అని రాస్తూ రాష్ట్రంలో జనం అందరి చెవుల్లో ఏకకాలంలో పువ్వులు పెట్టాలని చూశారు. అధికారుల ఒత్తిడి వల్లే తాము సభలకు వస్తున్నాము తప్పించి తమకు రావడం ఇష్టం లేదని మహిళ చెప్పినట్టు రాసేశారు. అంటే మహిళల్లో సీఎం జగన్మోహనరెడ్డికి ఆదరణ తగ్గిపోయిందని మనం అనుకోవాలని రాధాకృష్ణ ఉద్దేశం.
Also Read : అగ్గి రాజేసేందుకు ఆర్కే ఆపసోపాలు
ఉద్యోగులపై ప్రేమ..
పీఆర్సీ ఇవ్వకపోయినా, జీతాలు ఆలస్యమైనా ఎన్జీవోలు ప్రశ్నించడం లేదని, అసలు రాష్ట్రంలో ఎవరూ ప్రశ్నించడం లేదని, అలా ప్రశ్నించిన వారిని ప్రభుత్వం భయపెడుతోందని రాశారు. ప్రభుత్వం పథకాల అమలు బాధ్యతను అధికారులపైకి నెట్టెసి వారిపై ఒత్తిడి పెంచుతోందని వ్యాఖ్యానించారు. పథకాలను ఏ ప్రభుత్వంలోనైనా అధికారులే అమలు చేస్తారు. అది వారి విధి అయినప్పుడు ఒత్తిడి పెంచడం ఎలా అవుతుందో వేమూరి వారికే తెలియాలి.
అప్పులు తెస్తున్నారంటూ గగ్గోలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చారని, ఇందులో ఒక్క రూపాయి కూడా అభివృధ్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయలేదని పచ్చి అబద్ధాలు అడ్డకోలుగా రాశారు. అందులో వివిధ పథకాల లభ్దిదారులకు దాదాపు లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలు వారి వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసిన విషయం రాయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల స్కూళ్లను మా బడి నాడు – నేడు పథకంలో ఆధునీకరించిన అంశాన్ని ప్రస్తావించలేడు. పలు గ్రామాల్లో నిర్మించిన సచివాలయ భవనాల నిర్మాణం గురించి పేర్కొనలేదు. ఒకేసారి దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చిన విషయం, చాలా చోట్ల ఇంటి నిర్మాణాలు జోరుగా సాగుతున్న అంశం ప్రస్తావించలేదు. గ్రామ సచివాలయాల్లో లక్షా యాభై వేల పర్మినెంట్ ఉద్యోగులను, రెండున్నర లక్షల వలంటీర్లను నియమించిన సంగతీ రాయలేదు. ఇవన్నీ రాధాకృష్ణ దృష్టిలో వృధా వ్యయాలన్న మాట.
Also Read : తెలుగు రాష్ట్రాల సీఎంల మనసులోని మాట కూడా చెబుతోన్న రాధాకృష్ణ
మంచివారు ప్రశ్నించాలట!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నా ఆ వర్గాల నాయకులు నోళ్లకు తాళాలు వేసుకున్నారు. దాదాపు లక్ష కోట్ల బిల్లులు చెల్లింపులు కాక పెండింగులో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మేధావులు మౌనం వహిస్తారు. చెడును ప్రశ్నించని మంచివారి వల్ల ప్రపంచానికి చెడు జరుగుతుంది అని అబ్దుల్ కలాం చెప్పారని, అందుకని ఆంధ్రప్రదేశ్ లోని మంచివారంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ అలా ప్రశ్నించకుంటే రాధాకృష్ణ దృష్టిలో మనమంతా చెడ్డవాళ్లమే!
సంక్షేమానికి పరిమితులు విధించాలట..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ను సంక్షేమ పథకాలు ఎక్కువ అయిపోయాయని, ఇది ఎంత మాత్రం మంచిది కాదని ఈయన ఒక నిర్ధారణకు వచ్చారు. తెలంగాణలో కేసీఆర్ మొదటి టెర్మ్ లో పాలన బాగా చేశారని, రెండో టెర్మ్ లో జగన్మోహనరెడ్డిని చూసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఇది మంచిది కాదని పేర్కొన్నారు. ఈ పథకాల అమలుకు అప్పులు చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలను ముఖ్యమంత్రులు నాశనం చేస్తున్నారని బాధ పడిపోయారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ జోక్యం చేసుకుని సంక్షేమ పథకాల అమలుపై పరిమితులు విధించాలని సూచించారు. అలా చేయకుంటే రాష్ట్రాలు, చివరకు కేంద్రం అప్పుల ఊబిలో కూరుకుపోతాయని హెచ్చరించారు.
బాబు హయాం గోల్డ్!
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పాలనను గాడిలో పెట్టి చంద్రబాబునాయుడు అభివృద్ది పథంలో నడిపారు. రాజధాని అమరావతికి ఉచితంగా భూమిని సమకూర్చారు. రాష్ట్రానికి కీయా కార్ల పరిశ్రమను తీసుకు వచ్చారు. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ను తెచ్చారు అంటూ బాబుగారి స్తోత్రం కూడా చేశారు. ఏతావాతా చెప్పేదేమిటంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ప్రజలు ముఖ్యంగా రాయలసీమ సింహాలు, ఉద్యోగులు, మేధావులు ప్రభుత్వాన్ని కూల్చేయాలి. అపర చాణుక్యుడు శ్రీశ్రీశ్రీ చంద్ర బాబునాయుడిగారికి శాశ్వతంగా అధికార పీఠంపై పట్టాభిషేకం చేయాలి. ఇదీ కొత్తదనం మచ్చుకైనా లేని కొత్త పలుకు సారాంశం.
Also Read : అదే ఆక్రోశం.. మారని పద కోశం..