iDreamPost
iDreamPost
అబ్బో బాబూనే టార్గెట్ అట. ఎవరికైనా ప్రత్యర్థికాక మరెవరు టార్గెట్ అవుతారు? అయినా చర్యకు ప్రతి చర్యకు ఉంటుందనే కనీస సూత్రాన్ని విస్మరిస్తే ఎట్లా?
ఏంటేంటి? 151 స్థానాల్లో గెలిచిన వైసీపీకి ఇంకేం కావాలని ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది. అంతటితో ఆగిందా…అబ్బో ఇంకా చాలా నిలదీతలే ఉన్నాయి. ఐదు నెలల్లో జగన్ తన పాలనపై ప్రజల్లో అసంతృప్తి లేదని చాటేందుకు ఉప ఎన్నికల్లో విజయం ద్వారా నిరూపించాలనుకుంటున్నాడా? చంద్రబాబుకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అధికార పార్టీ పావులు కదుపుతోందా? అసెంబ్లీలో తిరుగులేని బలం, రికార్డు స్థాయిలో విజయం సాధించిన పార్టీ ఫిరాయింపులకు మరో రకంగా తెరలేపిందని ఆంధ్రజ్యోతి తెగబాధపడుతోంది.
ప్చ్…ఇప్పుడీ ఏడపులు, పెడబొబ్బలు పెడుతున్న వేమూరి రాధాకృష్ఖకు చంద్రబాబు తన పాలనలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నప్పుడు వద్దని ఒక్క మాటైనా చెప్పేందుకు నోరు పెగల్లేదెందుకు? హిత వచనాలు రాసేందుకు కలం కదల్లేదెందుకు?
పైపెచ్చు జగన్ నియంతృత్వాన్ని, ఒంటెత్తు పోకడలను భరించలేక తాము టీడీపీలోకి ఫిరాయించామని 23 మందితో లేఖ రాయించిన ఘనత చంద్రబాబుది కాదా? చూడండి ఆ జగన్ ఎలాంటి వాడో…చివరికి జగన్ తప్ప మరో నాయకుడు వైసీపీలో ఉండరని ఊరూ, వాడా దద్దరిల్లేలా పతాక శీర్షికలతో అక్షరాలను అచ్చేసి, టీవీ చానళ్లల్లో ఊదరగొట్టిన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ అప్పుడే మరచిపోయినట్టున్నాయి.
ఇప్పుడు తమ నాయకుడి ప్రతిపక్ష హోదాకు ముప్పు వస్తే మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి భూలావాదేవీలు, వ్యాపారాలు, కాంట్రాక్టులున్న వారిని లక్ష్యంగా చేసుకున్నట్టు వండివారుస్తున్నారు. తన దగ్గరికి ఎవరైనా రావాలనుకున్నట్టు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే కండీషన్‌ను జగన్ పెడుతున్నట్టు పొరుపాటునో, గ్రహపాటునో ఆంధ్రజ్యోతి రాసింది.
గతంలో 23 మందిని టీడీపీలోకి చేర్చుకోవడంతో పాటు ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో వైసీపీ చేయని పోరాటం లేదు. చివరికి అసెంబ్లీని కూడా బహిష్కరించి వైసీపీ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటుందని జగన్ మహాపాదయాత్ర చేపట్టేందుకు పార్టీ ఫిరాయింపులే కారణం కాదా?
ఇన్నిఅక్రమాలు, అరాచకాలు జరుగుతున్నా ఇది తప్పు అని ఏ సందర్భంలోనూ రాయని పచ్చ మీడియా… ఇప్పుడు బాబుకు ఏదో జరుగుతోందంటూ గగ్గోలు పెడుతోంది. ఈ అరుపులు, పెడబొబ్బల వెనుక బాబుపై ఒకవైపు సానుభూతి పెంచడం, అదే సమయంలో పాలక పార్టీపై వ్యతిరేకతను పెంచడమే లక్ష్యం.
ఎవరెన్ని రాసినా, చూపినా ప్రజలు విజ్ఞులని వేమూరి రాధాకృష్ణ తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు చెబుతున్న హిత వచనాలు అప్పట్లో బాబు చెవులో ఊదింటే ఈ శోకం తప్పి ఉండేది.
—-sodum ramana