iDreamPost
iDreamPost
2019 చివర్లో ప్రతి రోజు పండగేతో సూపర్ హిట్ ని, వెంకీ మామతో డీసెంట్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న రాశి ఖన్నాకు గత ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ గట్టి షాకే ఇచ్చింది. ఏరికోరి మరీ విజయ్ దేవరకొండతో చేసిన ఆ సినిమా డిజాస్టర్ కావడం అంతో ఇంతో తన అవకాశాల మీద ప్రభావం చూపించిన మాట వాస్తవం. ఇటీవలి కాలంలో తను తమిళంలోనే బాగా బిజీ అవుతోంది. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు సినిమాలు వివిధ దశల ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరో రెండు చర్చల దగ్గర ఫైనల్ అయ్యేందుకు ఎదురు చూస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే తనకు కోలీవుడ్ మంచి సేఫ్ జోన్ గా మారింది కాబోలు. అయితే ఎంతైనా తెలుగులో చేస్తే వచ్చే కిక్కు వేరే కదా.
తాజా సమాచారం మేరకు గోపీచంద్ మారుతీ కాంబోలో రూపొందబోయే సినిమాకు రాశి ఖన్నానే తీసుకోవడం దాదాపు ఫిక్స్ అయినట్టేనని వినికిడి. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకుండానే అక్టోబర్ 1 విడుదల తేదీ ఇచ్చేశారు. చాలా ప్లాన్డ్ గా నాలుగు నెలల్లోనే మొత్తం పూర్తి చేసేలా మారుతీ ఇప్పటికే పక్కా ప్లానింగ్ తో ఉన్నారట. ప్రతి రోజు పండగేలో ఎలాగూ వర్క్ అవుట్ అయిన కాంబినేషన్ కాబట్టి రాశిఖన్నా వైపే మారుతీ మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. అందులోనూ ఇతర హీరోయిన్లు బిజీగా ఉండటంతో పాటు డేట్ల సమస్య అధికంగా ఉంది. రాశి సానుకూలంగా ఉండటంతో మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
ఇందులో గోపీచంద్ లాయర్ గా కనిపిస్తాడట. డబ్బులు వస్తే చాలనుకునే రీతిలో ఏ కేసునైనా వాదించే క్రమంలో అనూహ్యంగా జరిగే ఓ సంఘటన అతను జీవితంలో పెను మార్పు తెస్తుంది. ఆ పాయింట్ మీదే ఇది సాగుతుందని ఇన్ సైడ్ టాక్. ఇది అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బి 2 లైన్ కి దగ్గరలో ఉన్నట్టు అనిపించినా రీమేక్ అని చెప్పడానికి యూనిట్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇక గోపిచంద్ రాశిఖన్నా కాంబోలో ఇది మూడో సినిమా అవుతుంది. ఇద్దరూ కలిసి గతంలో జిల్, ఆక్సిజన్ చేశారు. రెండోది పోయింది కానీ మొదటిది బాగానే ఆడింది. మరి హ్యాట్రిక్ మూవీ ఇది ఏ మాత్రం అంచనాలు నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి