మొన్న రాజధాని పర్యటనలో ఒక రైతు బాబు గారి బస్సు మీదకి చెప్పు విసిరిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది .
ఈ దుర్ఘటనపై సమాజం నుండి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి . రాజధానిలో రైతుల వద్ద నుండి భూములు లాక్కుని ఐదేళ్లలో కనీసం ప్లాట్స్ చూపించకుండా మోసం చేసినందుకు సరైన శాస్తి జరిగిందని రైతులు అంటుండగా , ఏమైనా తప్పులుంటే నిరసన వ్యక్తం చేయాలి కానీ చెప్పులు విసరడం ఏంటని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి .
మరి కొందరు టీడీపీ వాదులు ఇది వైసీపీ చేయించిన పనే అని ఆరోపిస్తుండగా , ఎన్టీఆర్ అభిమానులు కొందరు , వైసీపీ యాక్టివిస్టులు మాత్రం అలనాడు వైస్రాయ్ హోటల్ వద్ద ఎమ్మెల్యేల చేత ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించినందుకు ఇన్నాళ్లకు తగిన శాస్తి జరిగింది అని సంతోషిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు .
ఇదిలా ఉండగా ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి చేసిన అనుకూల వ్యాఖ్యలు అనుకోని అశనిపాతంలా మారాయి . తన మరిది పై చెప్పులు విసిరిన ఘటన పై ఆమె స్పందిస్తూ నష్టపోతే నిరసన వ్యక్తం చేయొచ్చు కానీ చెప్పులు విసరడం తప్పు అని వ్యాఖ్యానించారు .
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపాయి . ఆనాడు మీ నాన్న పై చెప్పులు విసరటానికి భర్త , మరుదుల్ని హారతి ఇచ్చి పంపిన మీరు ఇవాళ చెప్పులు విసరటానికి వ్యతిరేకంగా మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ట్రోల్స్ మొదలయ్యాయి .
నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై , రాష్ట్ర అధ్యక్షుడు కన్నా పై తిరుపతిలో రాళ్ళేసినప్పుడు మాట్లాడని చిన్నమ్మ ఈ రోజు మరిది పై చెప్పులు పడగానే బాధ వ్యక్తం చేయడం ఆశ్చర్యకరమని కొందరు బీజేపీ వాదులు అంటుండగా . బీజేపీకి వ్యతిరేకంగా మరిది బాబు దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఏకం చేస్తా అని తిరిగినప్పుడు , మోడీని మాకీ చూద్ అంటూ బాబు సమక్షంలో తమ్ముడు బాలయ్య తిట్టినప్పుడు నోరు పెగలని చిన్నమ్మ ఇప్పుడు నిరసన వ్యక్తం చేయడం విడ్డూరమని మరికొందరు బీజేపీ వ్యక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు .
ఇదిలా ఉండగా విశ్లేషకులు మాత్రం ఈ సంఘటన దరిమిలా బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలి హోదాలో పురందేశ్వరి స్పందించడాన్ని , ఇటీవలి టీడీపీ అందుకున్న మత అంశాల్ని గమనిస్తే మళ్లీ బలపడుతున్న టీడీపీ బీజేపీ బంధం అంటున్నారు . నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు , నీకెవరూ లేరు అంటూ అన్యాపదేశంగా నువ్వో సన్నాసివి అని మోడీని అవమానించిన బాబుని మరదలు మళ్లీ మోడీ చంక ఎక్కించగలుగుతుందా లేదా అన్నది చూడాలి .
ఏదేమైనా చెప్పు విసరటానికి వ్యతిరేకంగా పురందేశ్వరిచేసిన వ్యాఖ్యలు మాత్రం చంద్రబాబు కు సానుభూతి తీసుకురాకపోగా ,పుండు మీద కారంలా మారాయని చెప్పొచ్చు . ఈ వీకెండ్ సోషల్ మీడియా ట్రెండ్ చెప్పుల అంశమే అవుతుందనుకోవచ్చు