iDreamPost
iDreamPost
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్జిందర్ సింగ్ రణధావా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతవరకు సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీలో అంతర్గత కలహాల నేపథ్యంలో రాజీనామా చేయడంతో.. ఆయన వారసుడిగా సుఖ్జిందర్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది.
ఆ మేరకు పంజాబ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశమై సుఖ్జిందర్‌ను సీఎల్ఫీ నేతగా ఎన్నుకోవడం లాంఛనప్రాయమే. అనంతరం ఆయన గవర్నరును కలిసి.. ఆయన అనుమతితో పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
సిద్ధూ వర్గీయుడే..
పదవి నుంచి వైదొలగిన అమరీందర్ కేబినెట్‌లో సుఖ్జిందర్ జైళ్లు, సహకార శాఖ మంత్రిగా ఉన్నారు. అసమ్మతినేత, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ వర్గీయుడిగా పేరుంది. 2002లో ఫతేపూర్ చురియన్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2012, 2017 ఎన్నికల్లో డేరాబాబా నానక్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
Also Read: ఎన్నికలు – బహిష్కరణ- చంద్ర బాబు కొత్త సూత్రీకరణ
ఆయన తండ్రి సంతోఖ్ సింగ్ కాంగ్రెస్‌లో చాలా సీనియర్ నేత. రెండుసార్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కాగా 2015-16లో సట్లెజ్-యమునా లింక్ కెనాల్ ద్వారా పంజాబ్ నుంచి ఢిల్లీకి నీరు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా అప్పట్లో రాజీనామాలు చేసిన 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఈయన కూడా ఉన్నారు.
అనూహ్యంగా తెరపైకి
అమరీందర్ స్థానంలో పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ లేదా మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జక్కర్ లలో ఒకరికి అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు శనివారం సాయంత్రం జరిగిన సీఎల్ఫీ సమావేశంలో కొత్త సీఎం ఎంపిక అధికారాన్ని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాకు అప్పగిస్తూ తీర్మానం చేసిన తర్వాత రాత్రి పొద్దుపోయేవరకు ఢిల్లీలో కొత్త నేతపై హై కమాండ్ చర్చలు జరిపింది. ఆ సందర్బంగా రాజ్యసభ సభ్యురాలు అంబికా సోనీని సీఎంగా వెళ్లమని రాహుల్ గాంధీ సూచించారు. అందుకు ఆమె విముఖత వ్యక్తం చేయడంతో.. సుఖ్జిందర్ రణధావాను ఎంపిక చేసినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.
Also Read:పంజాబ్ కొత్త సీఎం ఎవరు?