Idream media
Idream media
నాలుగు దశాబ్ధాల రాజకీయ జీవితం, సుదీర్ఘకాలం ప్రజా ప్రతినిధిగా, ప్రస్తుతం మంత్రిగా సేవలందిస్తున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెడ్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న పరపతిని, పెద్దరికాన్ని పుంగనూరు నియోజకవర్గ ప్రజలు రాష్ట్రానికి చాటి చెప్పారు. పార్టీలకు అతీతంగా, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఐక్యతను చాటుతూ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. 3 వ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం 85 పంచాయతీలు ఉండగా.. 83 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
పంచాయతీలు ఏకగ్రీవాలు కావడంతో పుంగునూరులోని మండలాలు పోటీ పడ్డాయి. చౌడేపల్లి మండలంలో రెండు పంచాయతీలు మినహా మిగతా అన్ని మండలాల్లోని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పుంగనూరులో 23, రొంపిచర్లలో 10, చౌడేపల్లిలో 17, సోమలలో 15, మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో 18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు సర్వసాధారణమే అయినా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహారశైలి వల్ల ఈ సారి ఏకగ్రీవాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో మాదిరిగా ఈ సారి అంతే మొత్తంలో ఏకగ్రీవాలు అవుతున్నా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏకగ్రీవాలపై నానా హంగామా చేశారు. ఏకగ్రీవాలు వద్దని, ఏకగ్రీవాలు జరిగితే అధికారుల వైఫల్యమని, గొడవలు జరిగినా.. తర్వాత సమసిపోతాయని చెబుతూ.. ఎన్నికల్లో పాల్గొనాలంటూ.. ఇలా ప్రతి జిల్లాలో పర్యటించి హల్ చల్ చేశారు. చివరికి తొలి దశలో గుంటూరు, చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయంటూ.. వాటిని తాత్కాలికంగా నిలిపివేశారు. పోలింగ్ ముందు రోజు సాయంత్రం వాటిని క్లియర్ చేసినా.. అప్పటికే వివాదం పెద్దదైంది. పంచాయతీ రాజ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలుగుచేసుకోవాల్సి వచ్చింది. మంత్రిపై వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న నిమ్మగడ్డ.. ఆనక కోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గారు.
పంచాయతీ ఎన్నికలకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని దూరంగా ఉండాలని నిమ్మగడ్డ ఆదేశాలు చేయడం, మీడియాతో కూడా మాట్లాడకూడదంటూ ఆంక్షలు విధించడం సంచలనమైంది. ఈ నేపథ్యంలో పంగనూరు ప్రజలు తమ సత్తాను చాటారు. తమకు వివాదాలు వద్దని, గ్రామ అభివృద్ధే ముఖ్యమని తేల్చిచెప్పారు. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న ప్రజా మద్ధతును పంచాయతీలను ఏకగ్రీవం చేయడం ద్వారా స్పష్టం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులను కట్టడి చేయగలరేమో కానీ.. తమను ఆపలేరని పుంగనూరు ప్రజలు పంచాయతీలను ఏకగ్రీవం చేయడం ద్వారా చాటిచెప్పినట్లైంది.