iDreamPost
iDreamPost
కర్ణాటకలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ సినీ ప్రేక్షకులు అమితంగా అభిమానించే శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) ఇవాళ కన్నుమూశారు. ఉదయం పదిగంటల సమయంలో జిమ్ లో వ్యాయామం చేస్తుండగా హఠాత్తుగా కిందపడి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే క్లిష్టంగా మారిన పునీత్ ఆరోగ్యం మరింత విషమంగా మారి చివరికి కన్నుమూసినట్టు తెలిసింది. హాస్పిటల్ వద్ద ఆయన క్షేమ సమాచారం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది అభిమానుల ఆకాంక్షలు నెరవేర్చకుండా శాశ్వత సెలవు తీసుకున్నారు.
వెండితెర ఇలవేల్పుగా కొలువబడే స్వర్గీయ రాజ్ కుమార్ చివరి సంతానం పునీత్ రాజ్ కుమార్. చాలా చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసిన పునీత్ మొదటిసారి లోహిత్ పేరుతో తెరమీద కనిపించింది 1976లో వచ్చిన ప్రేమద కాణికెలో. ఆ తర్వాత వరసగా సంవత్సరానికి ఒకటి చొప్పున రాజ్ కుమార్ సినిమాల్లో పునీత్ నటిస్తూనే వచ్చాడు. సన్నాది అప్పన్న(1977), తాయికె తక్క మగ(1978), వసంత గీత(1980), భూమిగె బంద భగవంత(1981), భాగ్యవంత(1981), హోస బెళుకు(1982) ఇలా ఈ ప్రవాహం 1989లో వచ్చిన పరశురామ్ దాకా అప్రతిహతంగా కొనసాగింది. తర్వాత చదువు కోసం కొంత బ్రేక్ ఇచ్చారు పునీత్.
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన అప్పు ద్వారా 2002 లో పునీత్ సిల్వర్ స్క్రీన్ మీద సోలో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. డెబ్యూతోనే ఇండస్ట్రీ హిట్ సాధించిన హీరోగా ఇప్పటికీ ఆ రికార్డు పదిలంగా ఉంది. ఆ తర్వాత అభి, మౌర్య, వీర కన్నడిగ, అజయ్, అరసు, నమ్మ బసవ, మిలన, బిందాస్, పృథ్వి, రామ్, జాకీ, పరమాత్మ, అన్నా బాండ్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ఈ ఏడాది వచ్చిన యువరత్నను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన జేమ్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. కెజిఎఫ్ నిర్మాతలు ఇటీవలే ద్విత్వ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. కెరీర్ ఉజ్వలంగా వెలుగుతున్న సమయంలో పునీత్ ఇలా హఠాన్మరణం చెందటం యావత్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతికి నివాళి.
ALSO READ – Puneeth Rajkumar No More – షాకింగ్ : కన్నడ పవర్ స్టార్ ఇక లేరు