iDreamPost
android-app
ios-app

విదేశాలకు పులివెందుల అరటి సుగంధం

  • Published Sep 08, 2021 | 10:18 AM Updated Updated Sep 08, 2021 | 10:18 AM
విదేశాలకు పులివెందుల అరటి సుగంధం

పులివెందుల అంటే కొందరు రాజకీయ నాయకులు స్వార్ధ ప్రయోజనాల కోసం పదే పదే ఆరోపించిన ఫ్యాక్షన్ పోరాట ప్రాంతం కాదు . బొట్టు బొట్టుగా నీటిని ఒడిసిపట్టి మొక్క ప్రాణం నిలిపే ఆరాటం కలిగిన రైతు భూమి అని అరటి రైతులు నిరూపిస్తున్నారు.

వైఎస్సార్ కడప జిల్లా , పులివెందుల ఇతర రాయలసీమ ప్రాంతాల్లాగే వర్షాధార పంటలు పండించే ప్రాంతం . ప్రధానంగా వేరుశనగ , పత్తి , రాగి , సజ్జ , ఇతర చిరుధాన్యాలు అధికంగా పండించేవారు. బోర్ల ఆధారంగా కొంత వరి సాగయ్యేది . 2004 లో వైఎస్సార్ అధికారం చేపట్టాక హార్టీకల్చర్ కి అందించిన ప్రోత్సాహంతో డ్రిప్ సిస్టమ్ లాంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులు అవలంబిస్తూ బోర్ల ద్వారా వచ్చే కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకొంటూ అరటి , చీనీ , బొప్పాయి వంటి పండ్ల తోటలు సాగు చేయనారంభించారు .

కేవలం పదుల హెక్టార్లలో ప్రారంభమైన ఈ సాగు విజయవంతం అవుతుందా లేదా అనే విషయంలో పలు అనుమానాలు వ్యక్తమైనా పట్టుదలతో దాదాపు సాగునీటి వసతి మెండుగా ఉన్న ప్రాంత రైతులతో సమానంగా దిగుబడి సాధించారు . అలా మొదలైన అరటి సాగు నేడు ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 12,000 హెక్టార్లలో సాగు చేస్తూ సగటున 5,00,000 టన్నుల అరటి పండిస్తున్నారు .

హార్టికల్చర్ సాగుకు కొత్త అవటం వలన మొదట్లో పెద్దగా ఎగుమతి అవకాశాలు లేక చెన్నై , బెంగుళూరు తదితర ప్రాంతాల్లో అమ్ముకొన్న రైతులు సాగు విస్తీర్ణం పెరిగే కొద్దీ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడమే కాక 2014 నాటికి విదేశాలకు ఎగుమతి చేసే దిశగా పురోగతి సాధించారు . ఇతర ప్రాంతాల్లో పండించే అరటి సాధారణంగా 6 నుండి 7 రోజులు నిల్వ ఉంటే పులివెందులలో పండించే G9 సుగంధ రకాలు అరటి మాత్రం 10 నుండి 12 రోజులు నిల్వ ఉండే గుణాన్ని గమనించిన ఎగుమతిదారులు ఇక్కడి నుండి సేకరించి ఎగుమతి చేస్తుండటంతో స్థానిక రైతులకు సరైన ధర దక్కసాగింది .

Also Read : అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు, ఇప్పుడు కర్మ సిద్ధాంతం.. లోకేష్ తీరు

స్థానిక అరటి రైతులకు మరింత లాభం చేకూర్చి హార్టికల్చర్ ని ప్రోత్సహించే దిశగా కడపలో అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన జగన్ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె వద్ద 13 కోట్ల అంచనా వ్యయంతో అరటి పరిశోధనా కేంద్రం నిర్మాణానికి సంకల్పించింది . నిర్మాణంలో ఉన్న అరటి కేంద్రాన్ని నిన్న సందర్శించిన మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పరిశోధనా కేంద్రం పనులు పూర్తవుతాయని , 2022 జనవరి నుండి వండర్ బెర్రీ , ఇతర ఎగుమతి సంస్థల సహకారంతో ముద్దనూరు నుండి రైలు మార్గం ద్వారా ఎగుమతి కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించి ఇరాన్ సహా ఇతర మధ్య ఆసియా దేశాలకు ఎగుమతి చేయటం ద్వారా రైతుకు గరిష్ట ధర అందించే విధంగా కృషి చేస్తామన్నారు .

హార్టికల్చర్ ఏఈ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మిస్తున్న అరటి పరిశోధనా కేంద్రంలో పరిశోధనా విభాగంతో పాటు 600 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో స్టోరేజ్ , 125 టన్నుల ఫ్రీ కూలింగ్ , 5 లైన్ల గ్రేడింగ్ , ప్యాకింగ్ హౌస్ ల సదుపాయాలు కల్పించామని దీనివలన కరోనా మొదటి వేవ్ సమయంలో ఎగుమతులు నిలిచిపోవడంతో అరటి రైతులు తమ పంట నిల్వ చేసుకోలేక పడ్డ ఇబ్బందికర పరిస్థితి భవిష్యత్తులో తలెత్తకుండా శాస్త్రీయ పద్దతిలో పంట నిల్వ చేసుకొని గరిష్ట ధర పొందటానికి తోడ్పడుతుందని వివరించారు .

Also Read : టమోటాలను రోడ్డు పక్కన పడేసే పరిస్థితులు ఎన్నాళ్లు..? పరిష్కారం లేదా..?