iDreamPost
iDreamPost
పులిచింతల ఆనకట్ట గేటు పునరుద్ధరణ యత్నాలు ప్రారంభమయ్యాయి. తొలుత 16 వ నంబర్ గేటుకి మరమ్మతులు చేసేందుకు పూనుకున్నారు. గురువారం ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే యంత్రాంగం అప్రమత్తం కావడంతో నష్ట నివారణ సాధ్యం అయ్యింది. ప్రస్తుతం గేటు పునర్నిర్మాణం జరుగుతుండడంతో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి.
ఘటన సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన అధికారులు, మంత్రులు కదిలారు. ఘటనా స్థలం సందర్శించారు. అదే సమయంలో సీఎం కూడా ముందుచూపుతో వ్యవహరించారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 38 టీఎంసీల నిల్వ ఉంది. ఎగువన నాగార్జునసాగర్ నుంచి 2లక్షల వరకూ ఇన్ ఫ్లో ఉంది. అలాంటి స్థితిలో తెల్లవారుజామున జరిగిన ప్రమాదం ఆందోళన కలిగించింది. డ్యామ్ ఖాళీచేసేందుకు ఒకేసారి 5లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేయాలని అధికారులు భావించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం దిగువన కృష్ణా నది తీరంలో ఉన్న రైతుల కష్టాలను గమనంలో తీసుకున్నారు. ఒకేసారి వరద జలాలు పెంచితే రైతులు నష్టపోతారని భావించారు.
దాంతో క్రమంగా నీటి మట్టం తగ్గించేందుకు అనుగుణంగా డిశ్చార్జ్ పెంచారు. దాంతో పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు 17 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు . రెండురోజులుగా17 గేట్ల ద్వారా బయటకు 22 టీఎంసీలు నీటిని విడుదల చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
ప్రస్తుత నీటి నిల్వ తగ్గడంతో 16 నెంబర్ గేటుకు మరమ్మతులు ప్రారంభించారు. తాత్కాలికంగా గేటుని మూసివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైడ్రాలిక్ సిస్టమ్ లో గేటు ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అత్యవసరంగా ఊడిపోయిన పులిచింతల క్రస్ట్ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది.సాధారణ గేటు స్థాయిలోనే 18.5 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో అమార్చబోతున్నట్టు అధికారులు వెల్లడించారు. గేటు బరువు సుమారు 240 టన్నులు ఉంటుందని తెలిపారు. నేటి సాయంత్రానికి గేటు ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని, తద్వారా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీల నిల్వకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు.
Also Read : పులిచింతల గేటు సమస్య, కృష్ణా నదిలో వరద బెడద