iDreamPost
android-app
ios-app

బీజేపీ గూటికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు… అయినా పుదుచ్చేరి సీఎం ధీమా

బీజేపీ గూటికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు… అయినా పుదుచ్చేరి సీఎం ధీమా

మెజారిటీ నిరూపించుకునే గడువు సమీపిస్తున్న కొద్దీ పుదుచ్చేరిలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏ ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రభుత్వం మైనార్టీలో పడిందో వారు బీజేపీ గూటికి చేరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారి మద్దతుపై అంతట ఉత్కంఠ ఏర్పడింది. కాంగ్రెస్‌కు చెందిన మరో ముగ్గురు శాసనసభ్యులు ఒకట్రెండు రోజుల్లో తమ పార్టీలో చేరనున్నారని బీజేపీ పుదుచ్చేరి అధ్యక్షుడు స్వామినాథన్‌, మాజీమంత్రి నమశ్శివాయం ప్రకటించారు. కాగా, నామినేటెడ్‌ ఎమ్మెల్యేల ఓటు హక్కుపై అధికార, ప్రతిపక్ష వాదనలు భిన్నంగా ఉన్నాయి.

ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఉండే హక్కులన్నీ నామినేటెడ్‌ సభ్యులకూ ఉంటాయని స్వామినాథన్‌ చెబుతుండగా, వారికి ఓటు హక్కు లేదని సీఎం నారాయణ స్వామి చెబుతున్నారు. 22న జరగనున్న బలపరీక్షలో ముగ్గురు నామినేటెడ్‌ బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారని, దీనితో ప్రభుత్వం పతనం కావడం తథ్యమని స్వామినాథన్‌ అంటున్నారు. నారాయణస్వామి తీరు నచ్చకే పాలకపక్షం సభ్యులు పార్టీ నుంచి వైదొలగి బీజేపీలో చేరుతున్నారని, తామెవరినీ బెదిరించి పార్టీలో చేర్చుకోవడం లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందంటూ నారాయణస్వామి చేసిన ఆరోపణలను వారు ఖండించారు. ఆర్టికల్‌ 356 ద్వారా ప్రభుత్వాలను కూల్చివేసిన ఘనత కాంగ్రెస్‌దేనని, కేంద్రంలోని బీజేపీ ఇప్పటివరకూ ఏ ప్రభుత్వాన్నీ కూల్చలేదన్నారు.

ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాత్రం పుదుచ్చేరి శాసనసభలో 22న జరిగే బలపరీక్షలో నెగ్గి మెజారిటీని నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరింపులతో, డబ్బు ఆశ చూపి అధికారపక్ష ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించిందని ఆరోపించారు. శుక్రవారం ఉదయం తన చాంబర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రస్తుతం అధికారపక్షంలో ప్రజలు ఎన్నుకున్న 14మంది శాసనసభ్యులు ఉన్నారని చెప్పారు. నామినేటెడ్‌ బీజేపీ సభ్యులు ముగ్గురికీ ఓటు హక్కు లేదన్నారు. దీనిపై కోర్టులు గతంలో వెలువరించిన తీర్పులు ఉన్నాయని, ఈ విషయాలపై న్యాయనిపుణులతో చర్చలు జరుపనున్నామన్నారు. ఈ విపత్కర పరిస్థితిపై తమ కూటమి పార్టీ డీఎంకే ఎమ్మెల్యేలతోనూ చర్చిస్తామని వివరించారు.

ప్రభుత్వ విప్‌ అనంతరామన్‌ మాట్లాడుతూ… రాజ్యాంగం ప్రకారం ఆ ముగ్గురినీ బీజేపీకి చెందిన సభ్యులుగా పరిగణించేందుకు వీల్లేదన్నారు. వారు పార్టీపరంగా శాసనసభకు వస్తే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. నారాయణస్వామితో భేటీ అయినవారిలో మంత్రులు షాజహాన్‌, కమలకన్నన్‌, కందసామి, డిప్యూటీ స్పీకర్‌ ఎంఎన్‌ఆర్‌ బాలన్‌, శాసనసభ్యులు విజయవేణి, అనంతరామన్‌, జయమూర్తి తదితరులు ఉన్నారు. కాగా, రాజభవన్‌ నియోజకవర్గం శాసనసభ్యుడు లక్ష్మీనారాయణన్‌ ఈ సమావేశానికి గైర్హాజరవ్వడం గమనార్హం. మల్లాడి కృష్ణారావు(యానాం), జాన్‌కుమార్‌(కామరాజ్‌నగర్‌) తమ శాసనసభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేయడంతో అధికార కాంగ్రెస్‌- డీఎంకే కూటమి ప్రభుత్వానికి మెజారిటీ తగ్గింది. ప్రస్తుతం సభలో ముగ్గురు నామినేటెడ్‌ బీజేపీ సభ్యులు సహా మొత్తం 28మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.