iDreamPost
android-app
ios-app

మిస్కిన్ ‘సైకో’ మినీ రివ్యూ

  • Published Jan 26, 2020 | 3:43 PM Updated Updated Jan 26, 2020 | 3:43 PM
మిస్కిన్ ‘సైకో’ మినీ రివ్యూ

చాలా విభిన్నమైన కథలతో ఊహకందని స్క్రీన్ ప్లే తో సినిమాలు తీస్తాడని పేరున్న మిస్కిన్ కొత్త చిత్రం సైకో నిన్న విడుదలైంది. విశాల్ డిటెక్టివ్ తో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్న మిస్కిన్ టీజర్ వచ్చాక దీని మీద ఇక్కడి ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేపాడు. వాస్తవానికి తెలుగులోనూ రిలీజవుతుందనుకున్నారు కానీ ఏవో కారణాల వల్ల అది జరగలేదు. నిన్న భారీ ఎత్తున తమిళ్ లో వచ్చిన సైకో ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం.

కథ:

ఇది టీజర్ లో చూపించినట్టుగానే ఓ సైకో కిల్లర్ కథ. కోయంబత్తూర్ నగరంలో అమ్మాయిలను అపహరించి వాళ్ళ తలలు నరికి కేవలం శరీరాలను మాత్రం గుర్తు తెలియని ప్రదేశాల్లో వదిలి జనాన్ని భయపెడుతూ ఉంటాడు. ఇతని జాడ కోసం పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆచూకీ దొరకదు. ఈ క్రమంలో దాహిణి (అదితి రావు హైదరి)కూడా అతని చేత కిడ్నాప్ కు గురవుతుంది.

కానీ తనను మాత్రం సైకో ఓ ప్రత్యేకమైన కారణం వల్ల చంపకుండా బంధిస్తాడు. దాహిణిని ఇష్టపడిన గౌతమ్(ఉదయ్ నిధి స్టాలిన్)కళ్ళు లేకపోయినప్పటికీ సైకో వేట మొదలుపెడతాడు. అతనికి అంగవికలాంగురాలైన మాజీ పోలీస్ కమల (నిత్య మీనన్)సహాయపడుతుంది. మరి ఎవరికి దొరకని ఆ సైకో చివరికి హీరోకు ఎలా చిక్కాడు తర్వాత ఏం జరిగింది అనేదే మిగిలిన కథ.

ఎలా ఉంది:

రట్ససన్ (తెలుగు రాక్షసుడు) లాంటి ఇంటెన్స్ సైకో థ్రిల్లర్ చూసినవాళ్లకు సైకోలో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. పైగా కథనం చాలా నెమ్మదిగా సాగుతూ సహనానికి పరీక్ష పెడుతుంది. గుడ్డివాడైన హీరో సైకోను వేటాడటం అనే పాయింట్ లో ప్రత్యేకత ఉన్నప్పటికీ దాన్ని స్క్రీన్ ప్లే రూపంలో ఆసక్తికరంగా రాసుకోలేకపోవడంతో ఓ మాములు సినిమా ఫీలింగ్ కలుగుతుంది. ఉదయ్ నిధి స్టాలిన్ పాత్ర పరంగా చెప్పుకోవడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది. ఉన్నంతలో ఆదితి రావు హైదరి బాగా పెర్ఫార్మ్ చేసింది. తర్వాత క్రెడిట్ నిత్య మీనన్ కు ఇవ్వొచ్చు. సైకోగా చేసిన నటుడు మెప్పించలేకపోయాడు. అతన్ని చూస్తే భయం కలిగించడంలో మిస్కిన్ చేసిన ప్రయోగం విఫలమయ్యింది. కాకపోతే మరీ జుగుప్స కలిగేలా చాలా సన్నివేశాలు హింసాత్మకంగా చూపడం అతిగా అనిపిస్తుంది.

చివరిగా:

ఇంత నెగటివ్ అంశాలు ఉన్నప్పటికీ ఇళయరాజా సంగీతం మాత్రం ఆద్యంతం టెంపోని నిలబెట్టింది. ముఖ్యంగా ఉన్న మూడు పాటల్లో వింటేజ్ రాజా గుర్తుకువచ్చేలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. నేపధ్య సంగీతం కూడా ప్రాణం పోసింది. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మిస్కిన్ అసలైన కథాకథనాల విషయంలో మాత్రం తన మార్క్ చూపించలేకపోయారు. క్లైమాక్స్ సైతం అంతంతమాత్రంగానే సాగుతుంది. డిటెక్టివ్ తరహాలో సైకో నుంచి థ్రిల్ ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. ఇక్కడ ఉదయ్ నిధి స్టాలిన్ కి మార్కెట్ లేని దృష్ట్యా తెలుగులో డబ్ కావడం అనుమానమే.