iDreamPost
iDreamPost
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది కొత్త న్యాయమూర్తుల నియామకం ఖరారైంది. వారం క్రితం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో సుప్రీంకోర్టు కోలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. కొత్త న్యాయమూర్తులు ఈ నెల 31న జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా నియమితులైన తొమ్మిదిమందిలో తెలుగు వారైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.ఎస్.నరసింహ కూడా ఉండటం విశేషం. బార్ అసోసియేషన్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు ఎన్నికైన వారిలో ఆరో వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
పలు కీలక బాధ్యతల నిర్వహణ
పి.ఎస్.నరసింహ హైదరాబాదులో పుట్టి పెరిగారు. అక్కడే న్యాయశాస్త్రం చదివారు.
ఆయన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ కోదండరామయ్య కావడం విశేషం. వీరి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గణపవరం. నరసింహ యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు. అయితే పదవీకాలం పూర్తికాక ముందే రాజీనామా చేశారు. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రక్షాళన సమయంలో సుప్రీంకోర్టు కు అమికస్ క్యూరీగా వ్యవహరించి సహకరించారు. జాతీయ స్థాయిలో సంచలనం రేపిన అయోధ్య వివాదం కేసులో రాంలల్లా విరాజమాన్ ప్రతినిధి మహంత్ రామచంద్ర దాస్ తరపున వాదనలు వినిపించారు. ఇటాలియన్ మెరైన్ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ సభ్యుడిగా ఉన్నారు.
మూడో తెలుగు సీజేఐ అవుతారా?
సుప్రీంకోర్టులో ప్రస్తుతం 24 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కొత్తగా చేరే తొమ్మిదిమందితో ఆ సంఖ్య 33కు పెరుగుతుంది. వీరిలో తెలుగు న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకు పెరుగుతుంది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సుభాష్ రెడ్డి ఉన్నారు. నాలుగో న్యాయమూర్తిగా నరసింహ వారి సరసన చేరుతారు. కాగా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం 2027లో జస్టిస్ నగరత్నతోపాటు జస్టిస్ నరసింహకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు పేర్కొంటున్నాయి. నాగరత్న సీజేఐ అయితే ఆ పదవి చేపట్టిన తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్ర సృష్టిస్తారు. అదే నరసింహకు అవకాశం వస్తే అత్యున్నతమైన సీజేఐ పదవి చేపట్టిన మూడో తెలుగువారిగా ఘనత సాధిస్తారు. జస్టిస్ కోకా సుబ్బారావు తొలి తెలుగు సీజేఐ గా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన తర్వాత రెండో తెలుగు సీజేఐ గా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. మూడో తెలుగు సీజేఐ గా జస్టిస్ నరసింహ అవకాశం పొందాలని ఆకాంక్షిద్దాం.
Also Read : రాయలసీమ ఎత్తిపోతలు.. ఎన్జీటీ విచారణ అసంపూర్ణం