ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా భాగ్యనగరంలో అనేకమంది నిరాశ్రయులయ్యారు. వరదల వల్ల అనేకమంది ఇళ్ళు నీటమునిగాయి. రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి తక్షణ సాయం కింద 550 కోట్లు విడుదల చేసారు.
కాగా వరద బాధితులకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ. 550 కోట్లు తక్షణం విడుదల చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాటిని దసరా లోపే వరద బాధితులకు అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం లక్ష మందికి ఆర్ధిక సాయం అందేలా పని చేయాలని కేసీఆర్ సూచించారు.
కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పలువురు వరదబాధితులకు తీపి కబురుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తమ ఇళ్లతో పాటు, నిత్యావసరాలు కూడా నీటి పాలవడంతో తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో పలు కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు వరద సాయం దసరా లోపే అందించేలా చర్యలు తీసుకుంటే వారికి వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుంది.