iDreamPost
android-app
ios-app

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుంది?

  • Published Jan 25, 2022 | 2:09 AM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎప్పటిలోగా  పూర్తవుతుంది?

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరోసారి తెరమీదకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి సీఎం జగన్ ఎన్నికల హామీలో భాగంగా ఈ వ్యవహారం 2020 ఉగాది నాటికే పూర్తి చేయాలని సంకల్పించారు. కొంత ప్రయత్నం జరిగింది. కానీ కేంద్రం నుంచి వచ్చిన నిబంధనలతో అర్థాంతరంగా ఆగిపోయింది. ప్రధానంగా 2021 జనాభా లెక్కల ప్రక్రియ కోసం ఏడాది ముందుగా రెవెన్యూ జిల్లాల సరిహద్దులు మార్చకూడదనే ఆదేశాలు కేంద్రం నుంచి వచ్చాయి. దాంతో కొత్తగా ఏపీలో పార్లమెంట్ నియోజకవర్గానికో జిల్లా ఏర్పాటు అంశం ఆలస్యమయ్యింది. అయితే ఈసారి కోవిడ్ నేతృత్వంలో జనగణన సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. అదే సమయంలో కేంద్రం ఆదేశాల గడువు కూడా ముగిసింది. దానిని పొడిగించకపోవడంతో ఇక రెవెన్యూ హద్దులు మార్చేందుకు ఆటంకాలు తొలగిపోయినట్టేనని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

ఎట్టకేలకు గత డిసెంబర్ లో ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఓ సమావేశం నిర్వహించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జగన్ ప్రభుత్వం గతంలోనే దీనికి సంబంధించి సీఎస్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. కొంత కసరత్తు కూడా జరిగింది. పలు ప్రతిపాదనలు వచ్చాయి. ప్రధానంగా 25 పార్లమెంట్ స్థానాలను యధావిధిగా జిల్లాలుగా మార్చడమా లేక వైశాల్యం రీత్యా పెద్దదైన అరకు పార్లమెంట్ స్థానాన్ని రెండు జిల్లాలు చేయడమా అనే అంశం మీద సందిగ్ధం ఏర్పడింది. చివరకు అరకును విభజిస్తూ రెండు జిల్లాలుగా మార్చేందుకు ఎక్కువగా మొగ్గు కనిపించింది. సీఎం కూడా దాదాపుగా దానికే ఓకే చెప్పడంతో 26 జిల్లాలుగా ఏపీని మార్చేందుకు నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది.

జిల్లాల విభజనకు కొన్ని మార్గనిర్దేశకాలున్నాయి. తొలుత ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలవుతుంది. దానికి 30 రోజులు గడువు ఇస్తారు. అభ్యంతరాలు, అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. వాటిని ప్రజాభిప్రాయంగా పరిగణిస్తారు. వాటిని పరిశీలించి అవసరం మేరకు మార్పులు చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే మార్పులు చేసి తుది నోటిఫికేషన్ వస్తుంది. అపాయింటెడ్ డేట్ కూడా పేర్కొంటారు. దానికి అనుగుణంగా తొలుత కొత్త జిల్లాల ప్రతిపాదనలకు అనుగుణంగా అధికారుల కేటాయింపు, కార్యాలయాలను సిద్ధం చేయడం వంటివి జరుగుతాయి.ఇప్పటికే కొత్త జిల్లా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాచారం సేకరించింది. వాటిని క్రోఢీకరించి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ఉగాది నాటికి కొత్త జిల్లాలను ప్రారంభించాలంటే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. దానికి ముందుగానే ఒకటి రెండు రోజుల్లో ప్రాథమిక నివేదిక విడుదలవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పలు ప్రయోజనాలు రాష్ట్రానికి ఒనగూరే అవకాశం ఉంది. ఇప్పటికే పాలనా వికేంద్రీకరణలో జగన్ ప్రభుత్వం వేసిన అడుగులు అందరికీ ఆదర్శంగా ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో సచివాలయాల వ్యవస్థ సమూల మార్పులకు కారణమవుతోంది. జిల్లాల్లో కూడా అధికారులకు అనుభవం కోసం ముగ్గురేసి జేసీలను నియమించి పాలనా పద్ధతులు మార్చారు. త్వరలో మూడు రాజధానుల వ్యవహారం కూడా ముందుకు వస్తోంది. ఈ తరుణంలో కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్రంలో వివిధ రకాలుగా చర్చకు ఆస్కారమిస్తోంది.