బాధితురాలు పోలీస్ లకి ఫోన్ చేసి ఉండాల్సింది ,
ఫలానా యాప్ డౌన్ చేస్కొని అలెర్ట్ చేయాల్సింది , టోల్ గేట్ దగ్గర నిలబడి ఉండాల్సింది , వాళ్ళు పంచర్ వేయిస్తామంటే ఎలా నమ్మింది లాంటి ఉచిత సలహాలు ఇంక ఆపండి .
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మెదడు పాదరసంలా పని చెయ్యటానికి ఆడపిల్లలేం సెక్యూరిటీ ఫ్రొఫెషనల్స్ కాదు . అలాంటి పరిస్థితుల్లో భయంతో ఆలోచనా శక్తి మందగిస్తుంది ఎంతటి వారికైనా , బాగా గుండె నిబ్బరం ఉన్నవారికి , పోలీస్ , ఇతర రక్షణ రంగాల వారికి తప్ప సాధారణ మానవులు ఎవరైనా ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు ఎక్కువగా తడబడతారు స్త్రీలే కాదు పురుషులు కూడా .
ముందు మన బిడ్డలు,మన చుట్టూ ఉన్న మహిళలు మరో సారి ఇలాంటి దుర్ఘటనల్లో, పైశాచికత్వం నిండిన రాక్షసుల బారి పడకుండా గుర్తించడం , ముందు జాగ్రత్తలు తీసుకోవడం నేర్పండి . సమస్య ఏదైనా భయపడకుండా మీతో చర్చించే వాతావరణం కల్పించండి.
ఎవరో హీరో నో , పోలీస్ నో రావడానికి రక్షించడానికి ఇది సినిమా కాదు . వారొచ్చే వ్యవధిలో ఏమైనా జరగరాని ఘోరం జరగొచ్చు . మన బిడ్డల జాగ్రత్త గూర్చి ఆలోచించడం మాత్రమే కాదు, అందుకు తగ్గ చర్యలు తీసుకోవడం కూడా మన బాధ్యతే..
వేటగాళ్లు మహ్మద్ పాషా, సాయి గౌడ్ నే కానక్కర్లేదు, మంచి తనం ముసుగులో, పెద్దమనిషి హోదాలో మన చుట్టూ వుంటూ, మన మధ్యలోనే వున్న మన బంధువుల్లోనో, ముందుంటి రాజానో, వెనకింటి రాజేష్ నో కూడా కావొచ్చు.
అర చేతిలో పోర్న్ వీడియో లు లభ్యమయ్యే ఈరోజుల్లో ఆరాటం అణుచుకోలేని ఎవడో సరైన పెంపకం లేని ఉచ్ఛం నీచం తెలియని వెధవలు కూడా నీ చుట్టూ ఉన్న సమాజంలోని ఉంటూ నీ బిడ్డ పాలిటి యముడు కావొచ్చు.
సెక్స్ నేరం కాదు, శారీరక అవసరం. హార్మోన్ల చర్యకు ప్రతి చర్య, కోరిక తీర్చుకోవడం తప్పు కాదు అన్న భావ జాలపు ప్రతిఫలంగా మీ పిల్లల్ని రోజూ స్కూల్ కి తీసుకెళ్లే ఆటో డ్రైవర్ కావొచ్చు, చదువు చెప్పే మాస్టారు కూడా కావొచ్చు . బలాత్కారం అంటే శీలం దోచుకోవడమే కాదు, వికృత చేష్టలతో నీ బిడ్డను మానసికంగా చేసే చిత్రవధ కూడ బలాత్కారమే .అది కూడా మానసికంగా కుంగి ఆత్మహత్యకు దారి తీయవచ్చు . భావి జీవితం మీద అత్యంత తీవ్ర ప్రభావం చూపించవచ్చు .
Also Read : మృగాలను ప్రశ్నించిన అస్త్రం – సర్పయాగం
టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళి నిలబడుకుంటే విచిత్రంగా చూస్తారు అన్న ప్రియాంక భయం వెనక వున్నది తన తెలివి తక్కువ తనం కాదు . ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో, తప్పుగా అర్థం చేసుకుంటా రేమో, అని చిన్నతనం నుంచి నూరిపోసిన పరువు తాలూకు పిరికి తనమూ ఒక కారణమే .
దారిన పోయే బైకిస్ట్ ఏం పాపా వస్తావా అంటేనో?…
ఏం బేబీ లవర్ హ్యాండిచ్చాడా అని వెక్కిరిస్తేనో?..
ఈల వేసి పిలిచి ఏ పోరీ నీ హిప్ సూపర్ అంటేనో?..
–అన్న భయం, ఎదురుగా ప్రమాదం రావడానికి ఆస్కారం వుందన్న అనుమానాన్ని కూడా మింగేస్తాయి.ఈ భయాలు ప్రియాంక ఒక్క దానికే కాదు ప్రతీ ఆడపిల్లకు వున్నాయి .
అలాంటి పరిస్థితి కి ఎవరు కారణం అంటే అందరం కారణమే . స్కూళ్ళో వాడు నా జెడ లాగాడు అంటే మగ పిల్లాడు దగ్గరికి ఎందుకు వెళ్ళావే అని మన బిడ్డనే నిందించినప్పటి దగ్గర నుండి .దారిలో నడుస్తూ వస్తుంటే పిల్ల పిటపిట లాడుతోంది మామ అని కామెంట్ చేశాడు అని చెప్పినప్పుడు తలొంచుకుని రాకుండా వాడి వంక ఎందుకు చూసావే అని అమ్మ , అవన్నీ మామూలు అమ్మా పట్టించుకోకు అని నాన్న సర్ది చెప్పిందాకా అందరం బాధ్యులమే .జడ లాగినప్పుడు వాడి జుట్టు పట్టుకొని ఒకటి పీకే ధైర్యం మీరిస్తే , పిట పిట లాడుతుంది అన్నప్పుడు వాడి పళ్ళు రాల గొట్టి రావాల్సింది . నిన్ను ఎవరూ తప్పు పట్టరు , నీ వెనక నేనుంటా అనే ధైర్యం మనం ఇస్తే సమస్యని తానే ఎదుర్కొంటుంది . ఆటోమాటిగ్గా చుట్టూ ఉన్న సమాజం కూడా వెనక వస్తుంది .
అలా ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే విధానం నేర్పకుండా , మనకెందుకు గొడవ తలదించుకొని రమ్మంటేనో ,ఎదురు తిరిగితే కక్ష పెంచుకుంటాడేమో.
ప్రమాదం తల పెడతాడేమో . సమాజం ఏమనుకొంటుందో అన్న మన భయమే ఈరోజు ఇలా ఈ పరిస్థితికి కారణం .
ఒక్కసారి మీపిల్లల్ని అడిగి చూడండి. నిన్ను ఇబ్బంది పెట్టేటట్లుగా నీవైపు ఎవరైనా చూస్తున్నారా ? నీకు చిరాకుగా ఇబ్బంది అనిపించెట్లు ఎవరైనా తాకుతున్నారా అనేది సరళమైన మాటల్లో అడిగి తెలుసుకోండి . కొంచెం ఎదిగిన పిల్లలతో చెప్పండి నీతో ఎవరైనా ద్వంద్వార్ధాలతో మాట్లాడితే భయపడకుండా నాతో చెప్పమ్మా అని .
ఎండకు ఎండని వాడు, వానకు తడవని వాడు వుం డనట్లే హెరాస్మెంట్ ఎదుర్కోని వారు తక్కువే . ఒక్కసారి మీ భార్యనో , మీ చెల్లినో సౌమ్యంగా అడిగి చూడండి. వాల్లెలాంటి ఇబ్బందులు ఎదుర్కొని వుంటారో..
దారిన పోతుంటే ఒకడు నాతో అసహ్యంగా ప్రవర్తించాడు అని చెప్పుకునే స్వేచ్చ మనలో ఎంత మంది మన భార్యలకు ఇచ్చాము .పక్కింటి అంకుల్ లిఫ్టులో నా చెస్ట్ దగ్గర తాకాలని చూశాడు అని చెప్పే చొరవ మన పిల్లలకు మన దగ్గర వుందా??
మన మగ పిల్లలు ఎలాంటి స్నేహాలు చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, మొబైల్లో ఏమి చూస్తున్నారో, ఆడపిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నాడో పట్టించుకునే తీరిక మనకు వుందా?
ఎంతసేపూ మన పిల్లలకు, చదువులు, రాంకులు, సంపాదన గూర్చే కాదు,విలువలు,సభ్యత,సంస్కారం తో పాటు, అనుకోని సమస్య ఎదురైనప్పుడు ఎలా అధిగమించాలి, రాబోతున్న ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న స్వీయ రక్షణ విధానాల్ని నేర్పాలి , వాటితో పాటు లౌక్యం , మాటకారి తనం, ఆపదలు తప్పించుకునే నేర్పు , సందర్భానుసారం ప్రవర్తించి సమస్యని అధిగమించడం లాంటివి అలవారిచే బాధ్యత తల్లి తండ్రులుగా , గురువులుగా మనదే . చిన్న తనం నుండే కరాటే, కుంగ్ ఫూ లాంటి వాటిలో శిక్షణ ఇప్పించడం నేటి కాలంలో చాలా అవసరం . సందర్భాన్ని బట్టి వాళ్ళ నీడని కూడా వాళ్ళు అనుమానించే లక్షణం అలవాటు చేయాలి..
Also Read : ప్రియాంక హత్య కేసు నిందితులు
అత్యవసరం అయితే గానీ, చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు పోకుండా వుండటమే మేలనీ అర్థం అయ్యేలా చెప్పాలి . వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నదీ, ఎవరి కోసం వెళ్తున్నదీ , ఎక్కడ ఉన్నదీ ఎవరికొకరికి తెలుపుతూ వుండాలి..ఆటో, క్యాబ్ లాంటివి ఎక్కి నిర్మానుష్యమైన దారుల్లో ప్రయాణించవలసి ఎక్కగానే లొకేషన్ షేర్ చేయడం , తన వాళ్ళకి ఫోన్ చేసి డ్రైవర్ కి వినపడేట్లుగా ఆటో నంబర్ చెప్పటం నేర్పాలి . కొత్తవాల్లనెవరినీ నమ్మి సహాయం తీసుకొనే పరిస్థితులు రాకుండా చూసుకోవాలి . ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సివస్తే ఇంట్లో వాళ్లకు తప్పకుండా తెలియ చేయడమే కాకుండా, తెలియ చేసినట్లు వాళ్లకు కూడా తెలిసేలా చేయాలి..
రాత్రి పూట రైలు ప్రయాణంలో ఇతరులిచ్చే తినుబండారాలు తీసుకోకూడదు , బస్సులో పక్క సీట్ వారు ఆడవారు, పెద్ద వారు అయినా సరే వాల్లిచ్చిన తినుబండారాలు లాంటివి తీసుకోకుండా వుండమని లాంటి చిన్న జాగ్రత్తలు కూడా చెప్పాలి . కొత్త చోటకు వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకునేప్పుడు , బాత్రూంలో ఏమైనా హిద్దెన్ కెమెరాలు లాంటివి ఉన్నాయేమో చూసుకోవడం అలవాటు చేయాలి..
సాధ్యమైనంత వరకూ బయట స్టే చేయకుండా ఉండేట్లు చూసుకోవాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్తితుల్లో చేయవలసి వస్తే ఎవరైనా రూమ్ డోర్ కొట్టినప్పుడు ఎవరో, ఎందుకు వచ్చా రో నిర్దారణ చేసుకుని తీయమని చెప్పాలి . తెలిసిన వాడైనా సరే, అమ్మ రమ్మంది అనో, నాన్న రమ్మన్నాడు అనో చెబితే నమ్మి వెళ్లొద్దని చెప్పాలి అమాయకంగా వుండకుండా అన్నీ వేళలా అలెర్ట్ గా ఉండేట్లు ఎడ్యుకేట్ చేయాలి . అవసరమైతే జాలి దయ లేకుండా దెబ్బకొట్టేట్టు ఆత్మ రక్షణ విద్యలు నేర్పాలి .
అన్నిటికంటే ముఖ్యంగా నీ కన్నా , నీ భద్రత కన్నా , నీ ప్రాణం కన్నా మాకు ఏదీ ముఖ్యం కాదన్న భరోసా ఇవ్వ గలగాలి .
ప్రభుత్వాలు కూడా సంఘటన జరిగినప్పుడో , ప్రజల నుండి తీవ్రమైన స్పందన వచ్చినప్పుడో నిర్భయ లాంటి చట్టాలు చేయడం , రక్షణవ్యవస్థలు ఏర్పాటు చేయడం కాకుండా , కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి . దుర్ఘటనలు జరగడానికి అవకాశం ఉన్న నిర్మానుష్య ప్రాంతాల పై నిఘా పెంచాలి . పెంచిన విషయం ప్రజలందరికీ తెలియాలి .
దురదృష్టవశాత్తు మనకి చట్టాలు ఉన్నాయి కానీ వాటిని అతిక్రమిస్తే ఏమవుతుందో నూటికి తొంభై మందికి తెలీదు . మహిళల పట్ల , పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఏ చట్టం ప్రకారం ఏ శిక్షకు గురవుతారో స్కూల్ స్థాయి నుంచే అందరికి తెలిసే విధముగా ప్రచారం చేయాలి . ఆ శిక్షల పర్యవసానం తర్వాత కోల్పోయే జీవితం పట్ల అవగాహన వచ్చి భయం కలిగేట్లు చేయాలి .
Also Read: Stop Victim Blaming
అంతిమంగా కోల్పోయిన ప్రియాంక బంగారు జీవితాన్ని , ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం కానీ , మరో అమ్మాయి ఓ నిర్భయ , ఓ ప్రియాంక కాకుండా కాపాడుకోవడం తొంభై శాతం మన చేతుల్లోనే మన చేతల్లోనే ఉంది .
—పేరు రాయటానికి ఇష్టపడని ఒక తల్లి .