iDreamPost
android-app
ios-app

ప్రియాంక గాంధీ బంగ్లా బిజెపి ఎంపికి కేటాయింపు

ప్రియాంక గాంధీ బంగ్లా బిజెపి ఎంపికి కేటాయింపు

ఢిల్లీలోని ప్ర‌భుత్వ బంగ‌్లాను ఆగస్ట్‌ 1లోగా ఖాళీ చేయాలంటూ ప్రియంక గాంధీకి  కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ బంగ్లాను బిజెపి ఎంపి, మీడియా సెల్ ఇన్‌ఛార్జి అనిల్ బ‌లూనికి కేటాయిస్తూ కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం ఆయ‌న గురుద్వారాలోని రాకాబ్ గంజ్ రోడ్‌లో ఉంటున్నారు.

అయితే అనారోగ్య కార‌ణాల‌తో త‌న నివాసాన్ని మార్చాలంటూ బ‌లూని విన్న‌వించుకున్న‌ట్లు తెలుస్తోంది. కొంత‌కాలంగా ఆయ‌న క్యాన్స‌ర్ చికిత్స తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకున్న‌ప్ప‌టికీ అనేక జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని డాక్ట‌ర్లు సూచించారు. ఈ నేప‌థ్యంలోనే బ‌లూనీకి అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు ఉన్న 35 లోథీ ఎస్టేట్ బంగ్లాను కేటాయిస్తున్నార‌ని  ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

”బంగ‌్లా ఖాళీ ఏర్ప‌డిన‌ప్పుడు అర్హ‌త ఉన్న మ‌రొక‌రికి కేటాయించ‌డం అనేక సంద‌ర్భాల్లో చూశాం.. ఇది కూడా అలాంటిదే దీన్ని రాద్ధాంతం చేయ‌న‌వ‌స‌రం లేదు. ప్రియాంక గాంధీ ఖాళీ చేసిన వెంట‌నే బ‌లూని అక్క‌డికి మారతారు” అని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పిజి) భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని బంగ్లాను ఖాళీ చేయాలని ఇటీవ‌ల పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్‌ 1 తరువాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది.

2019 నవంబర్‌లో ప్రభుత్వం ఎస్‌పిజి కవర్‌ను ఉపసంహరించుకోవడంతో ప్రియాంక గాంధీ బంగ్లా కేటాయింపును కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఈ చర్యపై కాంగ్రెస్‌ విరుచుకుపడింది. మోడీ ద్వేష, ప్రతీకార రాజకీయాలకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ‘’ఇలాంటి చర్యలకు కాంగ్రెస్‌ భయపడదు. మోడీ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఉంటాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్‌ పార్టీ అంటే ఎంత ద్వేషం, పగ ఉన్నాయో దేశం మొత్తానికి తెలుసు. వారు ఇప్పుడు అని హద్దులు దాటారు. ప్రియాంక గాంధీని బంగ్లా ఖాళీ చేయమంటూ నోటీసులు పంపి ప్రధాని, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తమ ఆందోళనను వెల్లడించారు. కానీ ఇలాంటి చర్యలకు కాంగ్రెస్‌ భయపడదు’’ అంటూ ఆయన పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఆ బంగ్లాను ప్రియాంక వద్ద నుంచి ఖాళీ చేయించి బిజెపి ఎంపి, మీడియా సెల్ ఇన్‌ఛార్జి అనిల్ బ‌లూనికి కేటాయించింది.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పిజి) కవర్ ను ప్రభుత్వం గత నవంబర్‌లో ఉపసంహరించి.. సిఆర్పీఎఫ్ జెడ్-ప్లస్ భద్రత కల్పించింది. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఎస్‌పిజి రక్షకురాలిగా ఉన్నందున 1997 ఫిబ్రవరి 21న బంగ్లాను కేటాయించినట్లు మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. జెడ్-ప్లస్ సెక్యూరిటీకి అలాంటి సదుపాయం లేదు.

2022 విధాన సభ (అసెంబ్లీ) ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో పార్టీ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ప్రియాంక గాంధీ త్వరలోనే లక్నోకు నివాసాన్ని మార్చనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.