iDreamPost
iDreamPost
ఎన్నికల యాత్రకు సన్నాహాలు
నానాటికీ తీసికట్టు అన్నట్లున్న కాంగ్రెసును తిరిగి గట్టెక్కించే బాధ్యతలను పంచుకునేందుకు ప్రియాంక గాంధీ వాద్రా సిద్ధమయ్యారు. అందులో భాగంగా దేశంలో అతిపెద్ద, కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పార్టీని అధికారంలోకి తెచ్చే బృహత్తర బాధ్యతను ఆమెకు అప్పగించారు. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ముందు యూపీలో గెలవడం అనివార్యం. అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగితేనే.. కేంద్రంలో ఆధిక్యత సాధ్యమవుతుంది. అది సాధించాలంటే ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీలో పాగా వేయాలి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు దక్కింది. రాయబరేలీలో సోనియా మాత్రమే గెలిచారు. చివరికి అమేథీలో రాహుల్ కూడా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోవడం కాంగ్రెస్ దీనస్థితిని చెప్పకనే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే మర్చిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను ఏఐసీసీ ప్రియాంకకు అప్పగించింది.
ఈ నెలలోనే ఎన్నికల యాత్ర
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉన్నా బీజేపీ, ఇతర పార్టీలు అప్పుడే ఎన్నికల సన్నాహాలు ప్రారంభించడంతో కాంగ్రెస్ కూడా అప్రమత్తమైంది. ఎన్నికల పొత్తుకు సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు నిరాకరించడంతో ఈసారి కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే పూర్తిగా నిస్తేజం ఆవరించిన పార్టీలో మళ్లీ ఉత్సాహం నింపి.. పరుగులు తీయించడం చిన్న విషయం కాదు. దీన్ని గుర్తించిన ప్రియాంక ఇక నుంచి పూర్తిగా లక్నోలోనే మకాం వేసి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక యాత్ర చేయాలని తలపెట్టారు. చిత్రకూట్ జిల్లా నుంచి మొదలెట్టి రాష్ట్రాన్ని చుట్టేయాలని భావిస్తున్నారు. ఈ నెలలోనే ప్రారంభం కానున్న యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ రూపకల్పనలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు. ఈ యాత్రతో పార్టీకి కొత్త ఊపు వస్తుందని ఆశిస్తున్నారు.
జీరో స్థాయి నుంచి మొదలుపెట్టాలి
పూర్తిగా చితికిపోయిన కాంగ్రెసును అధికారానికి చేరువ చేయడం అంత సులభం కాదు. మిషన్ యూపీని స్టార్ట్ చేస్తున్న ప్రియాంక ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని 100 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 7 సీట్లే గెలవగలిగింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలి. అంటే 403 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలి. అయితే అంతమంది అభ్యర్థులు దొరుకుతారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. వరుస ఓటములతో అనేక మంది నాయకులు పార్టీని వీడిపోయారు. అందువల్ల ఎక్కడికక్కడ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి. చెదిరిపోయిన కార్యకర్తలను మళ్లీ సమీకరించుకొని వారి సాయంతో దూరమైన వర్గాలను తిరిగి పార్టీవైపు మళ్లించుకోవాలి. మొత్తంగా సున్నా స్థాయి నుంచి పార్టీని నిర్మించుకుంటూ వెళ్తే తప్ప ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోలేరు. మరి ప్రియాంక ఆ బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తించగలరో చూడాలి.