iDreamPost
android-app
ios-app

దేశ ప్రథమ పౌరుడిగా మూడేళ్లు..!

దేశ ప్రథమ పౌరుడిగా మూడేళ్లు..!

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంనాటికి పూర్తి చేసుకున్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. దేశ ప్రథమ పౌరుడిగా కరోనాపై పోరాటంలో ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నారని రాష్ట్రపతి కార్యాలయం ఒక ట్వీట్‌లో వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో 7వేల మంది సైనికులు, శాస్త్రవేత్తల్ని కోవింద్‌ కలుసుకున్నట్టు ఆ ట్వీట్‌లో వెల్లడించింది.

ఈ మూడేళ్లలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, సంక్షోభ సమయంలో ప్రదర్శించిన మానవత్వం గురించి రాష్ట్రపతి భవన్‌ వివరించింది. కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కి రాష్ట్రపతి ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఏడాదిపాటు 30% జీతాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌ తొలిసారిగా డిజిటల్‌ సదస్సులను ఏర్పాటు చేసింది. ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడి కరోనా పరిస్థితులపై చర్చలు జరిపారు. రాష్టపతి భవన్‌లో నిర్వహించే కార్యక్రమాలకు ఆన్‌లైన్‌ ద్వారా ఆహ్వానించే ఈ–ఇన్విటేషన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. పార్లమెంటు పాస్‌ చేసిన 48 బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వాల 22 బిల్లుల్ని ఆమోదించారు. 13 ఆర్డినెన్స్‌లు జారీ చేశారు. 11 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు.

రాష్ట్రపతి భవన్‌లో ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వినియోగంపై నిషేధం విధించి వాటి స్థానంలో గాజు బాటిల్స్‌ను వినియోగించడం మొదలు పెట్టారు. మూడో ఏడాది పదవీకాలంలో రామ్‌నాథ్‌ ఏడు రాష్ట్రాల్లో పర్యటించారు. రాష్ట్రపతిగా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుసుకున్న కోవింద్‌కు ఉప రాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు చెప్పారు. దేశ అభివృద్ధి విషయంలో మూడేళ్లుగా కోవింద్‌తో కలిసి పని చేస్తుండడం అద్భుతమైన అనుభూతినిస్తోందన్నారు.