వెండితెరపై ప్రేమకథలుకు ఎక్స్ పైరి డేట్ అంటూ ఉండదు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా తీయాలే కానీ వీటికి ఆదరణ ఎన్నడూ తగ్గదు. లైలా మజ్ను నుంచి ఉప్పెన దాకా ఈ ట్రెండ్ ఎలా కొనసాగుతుందో చూస్తూనే ఉన్నాం. అలా అని లవ్ స్టోరీ పేరుతో ఏది తీసినా చెల్లుతుందనే గ్యారెంటీ కూడా లేదు. కేవలం కాంబినేషన్ల మీద ఇలాంటివి సక్సెస్ కావు. ఎమోషన్లతో పాటు క్యాస్టింగ్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం ఏమరుపాటు నిర్ణయాలు తీసుకున్నా అనుభవజ్ఞులు సైతం చేదు ఫలితాలు చవిచూడక తప్పదు. దానికో చక్కని ఉదాహరణగా ప్రేమ విజేత సినిమాను చెప్పుకోవచ్చు.
1992వ సంవత్సరం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఒకపక్క ఇంద్రుడు చంద్రుడు, బొబ్బిలిరాజా, కూలీ నెంబర్ వన్ లాంటి బ్లాక్ బస్టర్లు మరో వైపు ప్రేమఖైది, సూరిగాడు, సర్పయాగం లాంటి తక్కువ బడ్జెట్ లో తీసిన సూపర్ హిట్లు. పట్టిందల్లా బంగారం అనే తరహాలో డాక్టర్ రామానాయుడు గారు, సురేష్ బాబు ఇద్దరూ చేస్తున్న జంట ప్రయాణం జోరుగా సాగుతోంది. ఆ టైంలోనే కులవివక్ష మీద ఓ మంచి ప్రేమకథ తీయాలనే సంకల్పంతో తమ బ్యానర్ లో కో డైరెక్టర్ గా పనిచేసిన సదాశివరావుకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు నాయుడుగారు. పరుచూరి బ్రదర్స్ ప్రేమవిజేత పేరుతో మంచి భావోద్వేగాలు ఉన్న సబ్జెక్టును రెడీ చేసి ఇచ్చారు.
దీని కోసం రెండు జంటలను తీసుకున్నారు. సురేష్-యమునా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో, హరీష్-రోజా వర్తమానంలో జరిగే కథలో కనిపిస్తారు. హరీష్ పక్కన రోజా జోడిగా బాగుండదు, రంభను తీసుకుందామని నాయుడు గారు చెప్పినా దర్శకుడు పట్టుబట్టడంతో అలాగే కానిచ్చేశారు. ఈ మధ్య కాలంలో మనం చూసిన సైరాత్, కలర్ ఫోటో తరహాలోనే గ్రామంలో కుల కట్టుబాట్లకు ప్రియురాలిని కోల్పోయిన పాత్రలో సురేష్ బాగా నటించారు. అయితే ప్రేమించినవాళ్లతో ఊరి పెద్ద పదే పదే విషం తాగించడమనే కాన్సెప్ట్ జనానికి అంతగా ఎక్కలేదు. డ్రామా శృతి మించింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద యుద్ధంలో సెప్టెంబర్ 11న విడుదలైన ప్రేమవిజేత ఓడిపోయాడు. నీలో అల గోదారి వెన్నెల అనే మంచి పాట తప్ప ఇళయరాజా సైతం ఎందుకో గొప్ప మ్యూజిక్ ఇవ్వలేకపోయారు.