iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ పై వివాదం పరిష్కారం దిశలో అడుగులు పడుతున్నాయి. మంత్రుల బృందంతో చర్చించిన తర్వాత ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి. జేఏసీ డిమాండ్లలో పలు అంశాలకు ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది. దాంతో సమ్మె ఉపసంహరించుకునేందుకు ఉద్యోగ సంఘాలు అంగీకరించినట్టు తెలిసింది. శనివారం ముఖ్యమంత్రి సమక్షంలో తుదిచర్చలు జరగబోతున్నాయి. ఆ తర్వాత ఆందోళన విరమించే అవకాశాలున్నాయి.
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి జనవరి 7న సీఎం సమక్షంలో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఫిట్ మెంట్ 23.29 శాతానికి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. హర్షం వ్యక్తం చేశాయి. సీఎం అయిన వెంటనే జగన్ 27 శాతం ఐఆర్ ప్రకటించినప్పటికీ కోవిడ్ అనంతర పరిస్థితుల్లో 23 శాతం ఫిట్ మెంట్ కి అంతా అంగీకరించారు. అయితే ఐఆర్ రికవరీ, హెచ్ ఆర్ ఏ శ్లాబుల మార్పు వంటి అంశాలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేశాయి. దాంతో జనవరి 16న పీఆర్సీ జీవోలు విడుదలయిన తర్వాత ఆందోళన మొదలయ్యింది. వివిధ దశలో నిరసనలు వ్యక్తంచేశారు. ఫిబ్రవరి 3న ఛలో విజయవాడకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తూనే ఉంది. చర్చలకు రావాలని ఆహ్వానిస్తోంది.
చివరకు శుక్రవారం సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. మంత్రుల బృందం, ఉద్యోగ సంఘాలు సెక్రటేరియేట్ లో జరిగిన చర్చల తర్వాత ఐఆర్ రికవరీ ఉండదని, హెచ్ ఆర్ ఏ విషయంలో శ్లాబుల మార్పునకు అనుగుణంగా మార్పులు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు ఉద్యోగులను సంతృప్తిపరిచాయి. సీసీఏ విషయంలో సంఘాలు పట్టుదలగా ఉన్నట్టు కనిపించాయి. అయితే సీఎం సమక్షంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడానికి ఇరువర్గాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారమవుతున్నట్టు కనిపించింది. కీలకమైన అంశాలలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం ఉద్యోగుల్లో సంతృప్తినింపుతోంది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి పెన్ డౌన్, సోమవారం నుంచి సమ్మె బాట పట్టాలని తొలుత తీసుకున్న నిర్ణయాలు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీ హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. చట్టానికి విరుద్ధంగా ఏం జరిగినా దాన్ని నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలిపింది.ఎలాంటి చర్యలనైనా తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని చెప్పింది.పెన్ డౌన్ అయినా సమ్మె అయినా అలాంటి కార్యక్రమం ఏం చేసినా రూల్ 4 కింద నిషేధం ఉందంటూ ఏజే కోర్టుకి తెలిపారు.సోమవారం నాటికి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని హైకోర్టుకు తెలిపింది. దాంతో వ్యవహారం తెగేవరకూ లాగకుండా ఇరువర్గాలు సిద్ధంకావడం విశేషం.
Also Read : మంత్రులతో జగన్ కీలక భేటీ : కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం?