iDreamPost
iDreamPost
సాధారణంగా హీరోలు హిజ్రా పాత్రలు వేయడానికి వెనుకాడతారు. సమాజంలో వాళ్ళ పట్ల ఉన్న వివక్ష, ఏహ్య భావం వల్ల తమ ఇమేజ్ కు ఏమైనా భంగం కలుగుతుందేమో అన్న భయం లోలోపల వెంటాడుతూ ఉంటుంది. కామెడీ కోసం కాసేపు ఆడ వేషానికి రెడీ అంటారు కానీ ఫుల్ లెన్త్ రోల్ అంటే నో చెప్పేవాళ్ళే ఎక్కువే. ఇప్పుడంటే లారెన్స్ పుణ్యమాని అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోని చీర కట్టుకుని విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ లో అలరించే లక్ష్మిగా చూసాం కానీ చాలా ఏళ్ళ క్రితమే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అలాంటి ప్రయోగం చేశారంటే ఆశ్చర్యం కలగక మానదు. అది కూడా స్వంత బ్యానర్ లో. ఆ విశేషాలు చూద్దాం.
1991లో సంజయ్ దత్ హీరోగా మహేష్ భట్ దర్శకత్వంలో రూపొందిన సడక్ అప్పట్లో సంచలన విజయం నమోదు చేసుకుని ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ గా చెప్పుకునే స్థాయిలో నిలిచిపోయింది. అందులో విలన్ హిజ్రాగా నటించిన సదాశివ్ అమ్రపుర్కర్ కు చాలా పేరు వచ్చింది. ఈ పాత్రను ఇతర భాషలో అంత గొప్పగా పోషించే నటుడు లేక ఎవరూ రీమేక్ చేసే సాహసం చేయలేకపోయారు. 2000 సంవత్సరంలో ప్రకాష్ రాజ్ దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని పునఃనిర్మించాలని డిసైడ్ అయ్యాడు. అప్పుడు తీసిందే తమిళంలో వచ్చిన ‘అప్పు’. తెలుగులో ‘మహారాణి’గా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. వసంత్ దర్శకత్వం వహించగా దేవా సంగీతం అందించారు.
మహారాణి(ప్రకాష్ రాజ్)నడిపే వ్యభిచార గృహంలో చిక్కుకున్న సీత(దేవయాని)ని ప్రేమిస్తాడు అప్పు(ప్రశాంత్). ఇదే వలయంలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకున్న తన అక్కయ్య(ఈశ్వరిరావు)చావుకు బదులు తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ప్రమాదకరమైన మహారాణి చేతిలో తన స్నేహితులను కోల్పోతాడు. మరి ఆమె పీడను వదిలించుకుని మహారాణిని చంపి అప్పు తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే కథ. సడక్ స్థాయిలో వసంత్ మహారాణిని తీర్చిదిద్దలేకపోయారు. కానీ ప్రకాష్ రాజ్ అద్భుతనటన సినిమాను కొంతమేరకు నిలబెట్టింది. జీన్స్ ప్రశాంత్, సుస్వాగతం దేవయాని జోడి బాగా కుదిరింది. తర్వాత ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ ఎవరూ చేయలేకపోయారు