iDreamPost
android-app
ios-app

తాడిపత్రి ప్రబోధానంద మరణం

తాడిపత్రి ప్రబోధానంద మరణం

“త్రైతసిద్ధాంతం” ప్రచారకర్తగా హిందూ దేవుళ్ళ మీద వివాదాస్పద వాఖ్యలు చేసే ప్రబోధానంద కొద్దీ సేపటి కిందట మరణించారు. రెండు సంవత్సరాల ముందు గణేష్ నిమజ్జనం రోజు జరిగిన గొడవతో తాడిపత్రికి చెందిన ప్రబోధానంద రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు.

తాడిపత్రి మండలం అమ్మలదిన్నెకొత్తపల్లికి చెందిన గుత్తా పెద్దన్న చౌదరి ఆర్మీలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పని చేశారు . తర్వాత ఆర్ఎంపీ వైద్యుడిగా కొన్నాళ్లు సేవలందించారు . ప్రాచీన ఆయుర్వేదంపై పుస్తకాలు రాశారు . మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో జ్ఞానబోధపై పుస్తకాలు రచించారు . 1978 లో తాడిపత్రి సమీపంలోని నందలపాడులో ఆశ్రమం స్థాపించారు. గుత్తా పెద్దన్న చౌదరి అనే పేరును ప్రభోదా నంద యోగీశ్వరులుగా మార్చుకున్నారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ సందేశాలను మిళితం చేసి ప్రభోదానంద ‘ త్రైతసిద్ధాంతం ‘ రూపొందించి పుస్తకాలు రాశారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య సమయంలో తాడిపత్రిలో పలువురు సానుభూతిపరుల దుకాణాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి . బీజేపీ నేత ఆలె నరేంద్ర అప్పుడు తాడిపత్రిలో పర్యటించి బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు . ప్రభోదానంద బీజేపీ సానుభూతిపరుడు . వేణుగోపాల్ రెడ్డి అనే బీజేపీ నేత నాడు కాంగ్రెస్ లో ఉన్న జేసీ సోదరులకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అయన్ను పట్టణం నుంచి తరిమి కొట్టాలని జేసీ సోదరులు ప్రయత్నించగా ప్రభోదానంద అడ్డు కుని ఆశ్రయం కల్పించారు . ఆశ్రమంపై దాడికి దిగి ఖాళీ చేయించారు .

అనంతరం ప్రభోదానంద అనంతపురంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు . అక్కడ కూడా ఓ వ్యక్తి ద్వారా ఆశ్రమాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం జరిగినా ప్రభోదా నంద గట్టిగా ఎదుర్కొన్నారు . ఓ రోజు చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వెళ్లిన ఓ మహిళతో పాటు ప్రభోదానంద మూడేళ్ల కుమారుడు యుగంధర్ ను కొందరు చంపేశారు . తర్వాత ఆశ్రమం బత్తలపల్లికి మార్చినా అక్కడ కూడా అదే పరిస్థితులు ఎదురుకావడంతో రాష్ట్రం వదిలి కర్ణాటకలోని కంప్లి చేరుకున్నారు . అక్కడి నుంచి ‘ త్రైత సిద్ధాంతాన్ని ‘ ప్రచారం చేశారు . తాడిపత్రి ఆశ్రమంలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన భారీ ప్రింటింగ్ ప్రెస్ ఉంది . పలు భాషల్లోకి ప్రభోదానంద బోధనలను తర్జుమా చేసి పుస్తకాలు విక్రయిస్తారు . ఇదే వీరి ప్రధాన వ్యాపారం . భక్తులు ఆశ్రమానికి భారీగా విరాళాలు అందుతుంటాయి.

12 ఏళ్ల క్రితం తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడలో తిరిగి ఆశ్రమం స్థాపించారు . ప్రభోదా నంద ఆశ్రమంలో మూడు వైపులా భవనాలున్నాయి . జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడికి సమీపంలోనే ఇళ్లు కొనుగోలు చేశారు . ఆశ్రమ నిర్మాణానికి కూలీలు రాకుండా అడ్డుకో వడంతో ఇతర ప్రాంతాల నుంచి రప్పించారు . నీటిని నిలిపివేయడంతో సొంతంగా బోర్లు ఏర్పాటు చేసుకు న్నారు . ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రభోదానంద స్థిరపడ్డారు . ఆశ్రమంలో పౌర్ణమి , అమావాస్య నాడు జరిగే ప్రత్యేక బోధనల కోసం వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు . అనంతపురం జిల్లాలో ఆయనకు 25 వేల మంది భక్తులు ఉంటారని అంచనా . ఇందులో 15 వేల మంది తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన వారే . తెలంగాణ, కర్ణాటక , తమిళనాడు, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభోదానందకు భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది . అమెరికా , థాయ్ లాండ్ , జపాన్ , ఆస్ట్రేలియాలో బోధనలు సాగుతున్నాయి . గతకొంత కాలంగా ప్రభోదానంద ఎక్కడున్నారో తెలియదు . ఆయన ప్రసంగాలను వీడియో తీసి – యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. వాటిని ఆశ్రమంలోని తెరలపై ప్రసారం చేస్తున్నారు .

జేసీ సోదరులనును గట్టిగా ఎదుర్కోవాలంటే రాజకీయ అండదండలు అవసరమని భావించిన ప్రభోదానంద కుమారులు జలంధర్ చౌదరి , యోగానంద చౌదరిలు మూడేళ్ళ క్రితం అప్పటి మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు సమక్షంలో బీజేపీలో చేరారు . తాడిపత్రి వద్ద ఆశ్రమం నిర్మాణ తారస్థాయికి చేరుకున్న సమయంలో ఇసుక సరఫరా కాకుండా అడ్డుకోవడంతో నిర్వాహకులు మానవహక్కుల కమీషన్ ను ఆశ్రయించ డంతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది . ఈ ఘటన తర్వాత తాడిపత్రి సమీపంలోని రావి వెంకటాపురంలో కమ్మ కళ్యాణ మండపాన్ని నిర్మించారు . ప్రారంభోత్సవానికి టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఆహ్వానించారు. అంతకుముందు పరిటాల శ్రీరాంను కాకర్ల రంగనాథ్ తన నివాసంలో భోజనానికి ఆహ్వానించారు . ఈ ఘటనతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరంతా ఏకమై జేసీ బ్రదర్స్ కు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు.

2019 ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేస్తారన్న అనుమానంతో గణేశ్ నిమజ్జనం ఘటనను జేసీ బ్రదర్స్ అస్త్రంగా వాడుకున్నారు. తమ ఆశ్రమం ముందు నుంచి గణేశ్ నిమజ్జనం యాత్రని తీసుకెళ్లొద్దని ప్రబోధానంద భక్తులు చేసిన విన్నపాన్ని జేసీ వర్గం పట్టించుకోలేదు. జేసీ వర్గం గొడవ చేస్తుందన్న అనుమానంతో వేలమంది భక్తులు ముందు రోజే ఆశ్రమం చేరుకున్నారు.. గణేష్ నిమజ్జనం యాత్ర ప్రబోధానంద ఆశ్రమం వద్దకు చేరుకోగానే ఇరువర్గాల మధ్య రాళ్ల యుద్ధం జరిగింది. జేసీ దివాకర్ రెడ్డికి కూడా ఒక రాయి తగిలింది. కొన్ని గంటలపాటు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొండిని. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యంది. ఇరువర్గాల వైపు నుంచి అరెస్టుల పర్వం కొనసాగింది.

ఈ ఘటనతో జేసీ సోదరుల ఓటమే తమ లక్ష్యం అని ప్రబోధానంద ప్రకటించారు.రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి తీవ్రమైన వ్యతిరేక గాలులు వీచినా తమ సొంత బలంతో తాడిపత్రిలో గెలుస్తామని జేసీ సోదరులు భావించారు. మరో వైపు జేసీ తరుపున రెండు దశాబ్దాలు రాజకీయం చేసిన భోగాతి నారాయణరెడ్డి కూడ టీడీపీని వీడి వైసీపీలో చేరటంతో తాడిపత్రిలో జేసీ కుటుంబం గెలుస్తుందా?అన్న అనుమానం స్థానికులలో కలిగింది… తుదకు తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి కొడుకు,అనంతపురం లోక్ సభ నుంచి దివాకర్ రెడ్డి కొడుకు ఓడిపోయారు.. వీరి ఓటమికి ముఖ్యంగా తాడిపత్రిలో ఓటమికి టాప్ ఫైవ్ కారణాలలో ప్రబోధానంద ఒక కారణం.

పునరుజ్జీవన నమ్మకం
ప్రబోధానంద మూడు రోజుల కిందట అంటే ఈనెల ఆరో తారీఖునే మరణించారని ,తాను మరణించిన మూడురోజు పునరుజ్జీవం చెందుతానని భక్తులు నమ్మకంతో ఇన్నిరోజులు ఆయన మరణం గురించి బయటపెట్టలేదన్న వార్త స్థానికంగా ప్రచారం జరుగుతుంది.

హిందు మతాన్ని పాటిస్తునే తనసొంత సిద్ధాంతాన్ని ముఖ్యంగా హిందూ పురాణాలను విమర్సిస్తూ,వాటికి భిన్నంగా బోధనలు చేసిన ప్రబోధానందకు పునరుజ్జీవనం మీద నమ్మకం ఉండటంలో ఆశ్చర్యం ఏమి లేదు.. అయితే నిజంగానే మూడు రోజుల కిందట చనిపోయారా లేదా అన్నది ధ్రువీకరణ జరగవలసి ఉంది.