iDreamPost
iDreamPost
ప్రతి బియ్యం గింజపై తినేవాడి పేరుంటుంది అంటారు. కానీ అక్కడి జనం ప్రతి బియ్యం గింజలో ఆయన రూపాన్నే చూసుకుంటారు. ఎప్పుడో పండగలకు పబ్బాలకే తప్ప..వరి అన్నం తినడం ఎరుగని ఆ ప్రాంత ప్రజలకు నిత్యం తినే అవకాశం కల్పించి ప్రతిరోజూ పండగే చేశాడాయన. కరువు కాటకాలతో అల్లాడిన ప్రాంతాన్ని యావత్ భారతదేశానికే ధాన్యాగారంగా మార్చారు. వరి ఉత్పత్తిలో గోదావరి జిల్లాలోనే ఒక అక్షయ పాత్రగా రూపొందించిన బ్రహ్మ ఆయన. అపర భగీరథుడిగా నీరాజనాలందుకొనే సర్ ఆర్థర్ కాటన్‌ను గోదావరి జిల్లా వాసులు ఎన్నటికీ మరువరు. ఆయనను దేశవ్యాప్తంగా చిరస్మరణీయం చేసేందుకు పోస్టల్ శాఖ సోమవారం ధవళేశ్వరంలో ఒక కవర్‌ను విడుదల చేస్తోంది.
విదేశీయుడు అయితేనేమి..
సర్ ఆర్థర్ థామస్ కాటన్ విదేశీయుడు అయినా ఈ ప్రాంతంలో సిరులు పండించిన ఆయనను తరాలు గడిచినా జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు. అతివృష్టి, అనావృష్టితో అతలాకుతలమైన ఈ ప్రాంతాన్ని ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మాణం ద్వారా సస్యశ్యామలం చేశారు. ఆయన మేధాశక్తిని, అవిరళ కృషిని ఏటా ఆయన జయంతి, వర్ధంతులకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఊరూరా స్మరించుకుంటూనే ఉంటారు. ఉభయగోదావరి జిల్లాలను అన్నపూర్ణగా మార్చి ఘనత ఆయనది. కాటన్ 1803 సంవత్సరంలో మే 15 తేదీన జన్మించారు. ఇంగ్లండ్‌లోని కేంబర్ మిర్ ఏబీలో హెన్రీకాల్వెలి, కాటన్ దంపతులకు ఆయన పదవ సంతానం. తన 15వ యేట క్లాయిడన్ వద్ద అడిన్‌కోండ్ సైనిక శిక్షణాలయంలో కేడెట్‌గా చేరారు. ప్రభుత్వం 1821లో మద్రాసులోని ముఖ్య ఇంజినీర్ కార్యాలయానికి పంపింది. 1836లో కొలరూన్ ఆనకట్ట నిర్మించి తంజావూర్ జిల్లాకు మేలు చేశారు. 1837లో మద్రాసులో నౌకాశ్రయ నిర్మాణం చేపట్టి తక్కువ కాలంలో పూర్తి చేశారు. 1841 అక్టోబర్ 29న ఆయన ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నారు.
Also Read : సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్ ఎప్పటి నుంచి అంటే..
గురుతర బాధ్యత అప్పగింత
కోస్తాంధ్ర ప్రాంతంలో 1839లో సంభవించిన పెనుతుఫాను, ఉప్పెన తాకిడికి దాదాపు రెండు లక్షలమంది మృత్యువాత పడ్డారు. తీవ్ర క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. తిండి గింజలకు అల్లాడిపోయిన గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు వలసలు వెళ్లిపోయారు. బ్రిటిష్ ప్రభుత్వంలో అలజడి రేగింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కాటన్‌ను ఆదేశించింది. పరిస్థితి అర్థం చేసుకున్న కాటన్ ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించాల్సిన అవసరం గుర్తించి, ప్రభుత్వానికి నివేదించారు. నిర్మాణానికి కావాల్సిన ప్రణాళిక తయారు చేసే బాధ్యతను కూడా ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. గోదావరి నదీ స్వరూపం, ప్రవాహ తీరు, ప్రభావాలు, మెట్ట పల్లాలు, ఏటిగట్లు, ఇతర భౌగోళిక పరిస్థితులను కాటన్ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇందుకు ఆయన తన గుర్రంపై మొత్తం ఈ ప్రాంతమంతా అలుపెరగకుండా పర్యటించారు. 1845లో ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. 1846లో ఆనకట్ట నిర్మాణానికి ఆమోదం లభించగా 1847లో శంకుస్థాపన జరిగింది.
రాళ్లెత్తిన కూలీలు..
ఒక మహాయజ్ఞంలా సాగిన ఆనకట్ట నిర్మాణం ఎప్పటికీ చెరగని అద్భుత చరిత్ర. 500 మంది వడ్రంగులు, 500 మంది కుమ్మరులు, పదివేల మందికి పైగా కూలీలు ఆనకట్ట నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆరోజుల్లో తాటిచెట్టు బోదులు, టేకు, సున్నపురాయిలతో నిర్మితమైన ఆనకట్ట అంత పటిష్టంగా రూపొందడం నేటికీ అద్భుతమే. 1852 నాటికి ఆనకట్ట నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు. దీని నిర్మాణంలో అప్పటి అధికారులు, కూలీలు పడ్డ కష్టం, అప్పుడు వారు ఉపయోగించిన యంత్ర సామగ్రి, కాటన్ గురించిన వివరాలు మనం ధవళేశ్వరంలోని కాటన్ మ్యూజియంలో తిలకించవచ్చు. ఒకప్పుడు నీరందక బీడు వారిన నేలలు కాటన్ కృషితో ముక్కారు పంటలు పండే సారవంతమైన భూములుగా మారాయి. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 4.40 లక్షల హెక్టార్ల సాగు జరుగుతూ ఆ ప్రాంతం భాగ్యసీమగా మారిందంటే కాటన్ పుణ్యమే. అందుకే ఆయనను ఈ నేల ఎప్పటికీ మరువదు.
తిరిగి ఇంగ్లాండ్‌కు
పదవీ విరమణ అనంతరం 1860లో కాటన్ ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లిపోయారు. కానీ పలు ప్రాజెక్టుల విషయంలో సలహాలు అందించేందుకు 1862, 63 సంవత్సరాల్లో ఆయన ఇండియా వచ్చారు. ఆయన సూచనల ఆధారంగానే కృష్ణా, గంగ, తుంగభద్ర నదులపై ఆనకట్టలు రూపుదిద్దుకున్నాయి. కాటన్‌ను బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’, ‘నైట్‌హుడ్’ బిరుదులతో సత్కరించింది. 1899 జూలై 24న ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Also Read : భద్రతా వైఫల్యంపై సుప్రీం ఏం చెప్పబోతోంది..?