తెలుగు శ్రోతలను తన కలం నుండి జాలువారిన అద్భుతమైన పాటల ప్రపంచంలో మైమరిపించిన ప్రముఖ సినీ గీత రచయిత వెన్నెలకంటి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. 300 పైగా సినిమాల్లో రెండు వేలకు పైగా పాటలు రాసిన వెన్నెలకంటి తెలుగు సినీ గీత రచయితగా తనదైన ముద్ర వేశారు.
వెన్నెలకంటి పూర్తి పేరు “రాజేశ్వరప్రసాద్”. కానీ తెలుగు సంగీత ప్రియులకు వెన్నెలకంటిగానే ఆయన పేరు సుపరిచితం. చిన్నతనం నుండే ఆయనకు సాహిత్యంపై మక్కువ ఎక్కువగా ఉండేది. 11 సంవత్సరాల చిన్నవయసులోనే భక్త దుఃఖనాశ పార్వతీశా అనే మకుటంతో శతకాన్ని రాసారు. దానితో పాటుగా రామచంద్ర శతకం, లలితా శతకం రచించి సాహిత్య ప్రియుల అభిమానాన్ని సంపాదించారు. ఈ క్రమంలో చదువును నిర్లక్ష్యం చేయలేదు.
విద్యాభ్యాసం అనంతరం ఎస్‌బీఐలో ఉద్యోగం సంపాదించినా సాహిత్యం మరియు సినిమాలపై ఉన్న మక్కువతో చెన్నై వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో 1986లో నటుడు ప్రభాకరరెడ్డి శ్రీరామచంద్రుడు సినిమాలో పాట రాసే అవకాశం వచ్చింది. అనంతరం 1987 లో అన్నా చెల్లెలు సినిమాలో అందాలు ఆవురుమన్నాయి అనే మరో పాట రాసారు. ఈ పాటల అనంతరం ఆయనకు మంచి పేరు రావడంతో ఎస్బిఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ గీత రచయితగా స్థిరపడ్డారు..
ఆయన తెలుగు సినీ రచయితగానే కాకుండా డబ్బింగ్ చిత్రాలకు పాటలు,మాటలు రాసి ఎనలేని ఖ్యాతిని సంపాదించారు. డబ్బింగ్ చిత్రాలకు రాసిన పాటల్లో కూడా సాహిత్యానికి పెద్దపీట వేసేవారు. తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ మరియు వెన్నెలకంటికి సత్సంబంధాలు ఉండేవి. కమల్ హాసన్ నటించిన పంచతంత్రం,
పోతురాజు, ముంబై ఎక్స్‌ప్రెస్, దశావతారం, మన్మథభాణం చిత్రాలకు వెన్నెలకంటి మాటలు రాసారు. వాటితో పాటు తమిళం నుంచి అనువాదమైన సరోజ, ప్రేమఖైదీ సినిమాలకు కూడా మాటలు రాశారు.
ముఖ్యంగా ఆయన మహర్షి సినిమాలో రాసిన మాటరాని మౌనమిది పాటకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆదిత్య 369, ఘరానా అల్లుడు, ఘరానా బుల్లోడు, క్రిమినల్, శ్రీ కృష్ణార్జున విజయం, సమరసింహారెడ్డి, శీను వంటి చిత్రాల్లో మంచి పాటలు రాశారు. ఆయన చివరిగా పెంగ్విన్ సినిమాకు పనిచేశారు. ఆయన కుమారులిద్దరు తెలుగు గీత రచయితలుగా పనిచేస్తూ ఉండటం విశేషం. కాగా తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ భావాలకు అక్షరరూపమిచ్చిన వెన్నెలకంటి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఆయన లేకపోయినా ఆయన పాటలు మనతో ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటాయని అనడంలో సందేహం లేదు..