Idream media
Idream media
నెల రోజుల తర్వాత అర్థమైంది ఏంటంటే కరోనా అంత సులభంగా విడిచి వెళ్లదని. తప్పించుకోడానికి వీల్లేనపుడు సహజీవనం చేయడమే ఉత్తమం. పండంటి దాంపత్యంలో ఇది ప్రథమ సూత్రం. దీన్నే కరోనాకి కూడా అప్లై చేస్తే సరిపోతుంది.
లైఫ్ ఆఫ్ పై సినిమాలో నడి సముద్రంలో ఒక పడవలో పులితో కలిసి ఒక కుర్రాడు ప్రయాణిస్తాడు. మొదట్లో ఒకర్ని చూసి ఇంకొకరు భయపడతారు. తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకొని కలిసిపోతారు. కరోనా పులిలాంటిదే. తింటుంది. కానీ తింటుందని ఎంత కాలం దాక్కుంటాం. దాన్ని ఎదిరించాలి, భరించాలి, లేదా చచ్చిపోవాలి.
ప్రధాని మోదీ ఈ మధ్య టాస్క్‌లివ్వడం మానేసి వినోదాన్ని తగ్గించాడు. శబ్దానికి , వెలుగుకి కరోనా పారిపోదని అర్థమైనట్టుంది. మొత్తానికి ఈ దేశ ప్రజల్ని రెండుసార్లు క్యూలో నిలబెట్టడం ఆయన వల్లే అయింది. సూపర్‌బజార్‌కు వెళితే క్యూ. చేతులు కడుక్కుని లోపలికెళ్లాలి.
ఒకప్పుడు చేతులు కడిగితే , భోజనానికి వెళ్లే వాళ్లం. ఇప్పుడు అన్నం పెట్టేవాడు లేడు కానీ, చేతులు కడక్కపోతే తంతారు.
ఫస్ట్ టాస్క్‌లో బాల్కానీలోకి వచ్చి చప్పట్లు కొట్టండి అన్నాడు మోదీ. ఈ దేశ ప్రజల్లో పది శాతం మందికి ఇళ్లే లేవు. 50 శాతం మంది ఇళ్లకి బాల్కానీలు లేవు. వాళ్లు ఎక్కడికి వచ్చి చప్పట్లు కొట్టాలో ప్రధాని చెప్పలేదు. మనం అడగలేదు. హఠాత్తుగా లాక్‌డౌన్ ప్రకటిస్తే కొన్ని కోట్ల మంది వలస కూలీల బతుకేంటి అని కూడా ఎవరూ అడగలేదు. మోదీ చెప్పలేదు.
కరోనా క్షయ జబ్బులా పేదలకి మాత్రమే వచ్చే వ్యాధి అయితే ఎవరికీ పట్టేది కాదు. ఏటా కొన్ని లక్షల మంది క్షయతో పోతున్నా అడిగేవాళ్లు లేరు. అయితే కరోనా ధనవంతులకి , సెలబ్రిటీలకి కూడా వస్తుంది. అదీ సమస్య. వెనుకటికి బొంబాయ్ మురికివాడల్లో ప్లేగు వచ్చినపుడు బ్రిటీష్ వాళ్లు సీరియస్‌గా తీసుకోకుండా , జనాభా తగ్గిందిలే అని వదిలేశారు. ఇప్పుడు అదే జరిగేది. అయితే కరోనా బ్రిటీష్ ప్రధానికి కూడా వచ్చింది. దానికి భయం లేదు. పాలకులకి వర్గ దృక్పథం ఉన్నా కరోనాకి లేదు. అది నిజమైన కమ్యూనిస్టు, మన కమ్యూనిస్టుల్లా కాదు (మన కమ్యూనిస్టు పత్రికలు ఉద్యోగాల కోత మీద శోకాలు పెడుతూ వార్తలు రాస్తూ తమ ఉద్యోగుల్ని తీసేస్తూ ఉంటాయి. పెట్టుబడిదారుల్ని తిడుతూ మంచి లాభాలకి టీవీ చానళ్లని అమ్ముకుంటాయి).
కులాలు, మతాలు అని అనవసరంగా కేకలు పెడతాం కానీ, దేశంలో ఉన్నవి ఇపుడు రెండే కులాలు. ఉన్నవాళ్లు, లేనివాళ్లు. రెండు మతాలు కరోనాని తట్టుకుని భద్రంగా జీవించేవాళ్లు, జీవించలేక రోడ్డున పడిన వాళ్లు.
వళ్లంతా కరోనా నింపుకుని విమానాలను దిగుతున్న వాళ్లని దేశం మీద వదిలేసి , మా ఊరికి మేము పోతాం అన్న వాళ్లని లాఠీలతో కొట్టి , ఒంటిమీద ద్రావణం పిచికారీ చేసి జంతువుల కంటే హీనంగా అవమానించి , భిక్షగాళ్లగా మార్చేశారు. అడుక్కు తింటే ఎవరికైనా ఉన్న ఊళ్లో కూడా ఇంత ముద్ద దొరుకుతుంది. కానీ యాచన ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది. అందుకే వాళ్లు కష్టపడి పని చేయడానికి ఇన్ని వందల కిలోమీటర్లు వచ్చారు. మనం వాళ్లకి ఇచ్చిన గౌరవం ఏంటి? పేదవాళ్లు అయితే వాళ్లు మనుషులు కాకుండా పోతారా?
మనం పనిచేసే ఆఫీసులు, నివసించే ఇల్లు అన్నీ వాళ్ల చెమటతో తడిసినవే. చీమలు పెట్టిన పుట్టల్లో ఉంటున్నది ఎవరు?
కాశీకి వెళ్లిన వాళ్లని , ప్రత్యేక బస్సుల్లో తీసుకొచ్చారు. వాళ్లు పవిత్ర గంగా జలాన్ని నెత్తిన వేసుకున్న వాళ్లు, విశ్వేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు. అన్నిటికి మించి అంతోఇంతో డబ్బులున్న వాళ్లు. వాళ్లకో నియోజకవర్గం ఉంది. ఎమ్మెల్యే ఉన్నాడు. ఓట్లున్నాయి, కుల సంఘాలున్నాయి.
ఈ వలస కూలీలెవరు? దిక్కులేని వాళ్లు. వాళ్లది ఏ ఊరో ఎవరికీ తెలియదు. చాలా మందికి ఆధార్‌కార్డులు కూడా లేవు. ఓట్లు కూడా ఉండవు. ఉన్నవాళ్లు వెళ్లి వేయలేరు. ఎమ్మెల్యే , ఎంపీల దృష్టిలో ప్రజలంటే ఓటర్లే.
ఇది కాకుండా ఎక్కడో చిక్కుకుపోయిన విద్యార్థుల్ని తీసుకొచ్చారు. మంచిదే. తమ ఇళ్లు చేరాలనే ఎమోషన్ ఉండాలంటే మనకు డబ్బులుండాలా? పేదవాళ్లకి ఎమోషన్ ఉండకూడదా?
ప్రపంచం దుక్కమయం అన్నాడు బుద్ధుడు, ప్రపంచం వర్గమయం అన్నాడు మార్క్స్. కరోనాతో ఈ రెండూ స్పష్టంగా అర్థమవుతున్నాయి.