iDreamPost
android-app
ios-app

ఉచితాలు అంటే రద్దు : కేంద్రానికి ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు!

ఉచితాలు అంటే రద్దు : కేంద్రానికి ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు!

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు, అనేక రాజకీయ పార్టీలు తరచుగా నగదు మరియు ఉచితాలను వాగ్దానం చేస్తూ ఉంటాయి. స్వతంత్ర భారతంలో ఇప్పటికీ అలవి కాని హామీలు ఇవ్వడం అనేక విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి వాగ్దానాలు మానుకోవాలని అనేక వర్గాల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. తాజాగా దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అటువంటి రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలను జప్తు చేయాలని, వాటి గుర్తింపును రద్దు చేయాలని పిటిషన్‌లో సుప్రీం కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌ను అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేశారు.

ప్రజాధనంతో ఉచితంగా వస్తువులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దేశంలోని ఐదు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో సుప్రీంకోర్టు కమిషన్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ఈ నోటీసులు పంపింది. ఈ ఎన్నికల సంధర్భంగా అనేక పార్టీలు వివిధ రాష్ట్రాల్లో అనేక ఉచిత సౌకర్యాలను ప్రకటించాయి. యూపీ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేయలేదు, అయితే అనేక ర్యాలీలు, ప్రెస్ టాక్స్‌లలో రాజకీయ పార్టీలు తాము ప్రకటిస్తున్న వాటిని మేనిఫెస్టోలో ప్రస్తావిస్తామని ప్రజలకు హామీ ఇచ్చాయి.

బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే సాగునీటికి సగానికి సగం కరెంటు రేటు తగ్గిస్తానని హామీ ఇచ్చింది. మరోవైపు అమ్మాయిలకు స్మార్ట్‌ ఫోన్లు, స్కూటీలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది కాకుండా, కాంగ్రెస్ యువజన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. దీనిలో పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పరీక్షల ఫీజులను మాఫీ చేస్తామని, అభ్యర్థులకు బస్సు, రైలు ప్రయాణాన్ని ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చింది.

మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు సాగునీటికి ఉచిత విద్యుత్, విద్యార్థులు, యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, పేద మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి నెలా 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా, రైతులకు సాగునీటికి ఉచిత విద్యుత్, బకాయి ఉన్న విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని హామీలు ఇచ్చింది. మహిళలకు నెలకు రూ.1,000, నిరుద్యోగులకు రూ.5,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఆయా పార్టీలు ఇచ్చిన హామీల్లో ఇవి కొన్నే. ఇలా అలవికాని హామీలు ఇస్తున్నారు కానీ వాటిని అమలు చేసే పరిస్థితి ఉండడంలేదు. మొత్తం మీద సుప్రీంకోర్టు విచారణ.. అడ్డుఅదువు లేకుండా సాగుతున్న రాజకీయ పార్టీల హామీలకు అడ్డుకట్ట వేస్తుందా..? లేదా..? చూడాలి.