iDreamPost
android-app
ios-app

వైసీపీ కీలక నేతలకు బాధ్యతల మార్పు

వైసీపీ కీలక నేతలకు బాధ్యతల మార్పు

వైసీపీ కీలక నేతలుగా వ్యవహరిస్తున్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించిన బాధ్య‌త‌లలో మార్పులు చేర్పులు చేస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగ‌ళ‌వారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేలు, మీడియా కో ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించగా.. విజయ సాయిరెడ్డికి రీజనల్, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కో ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. గతంలో విజయసాయికి కేవలం అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జలకు పార్టీ పరంగా మరిన్ని బాధ్యతలు అప్పచెప్పారు.

ఈ మేరకు 19వ తేదీన ఉత్తర్వులు వెలువడ్డాయి. అదే రోజు 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, 11 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను కూడా నియమించారు. 19వ తేదీన వెలువడిన ఉత్తర్వుల ప్రకారం కర్నూలు, నంద్యాల బాధ్యతలు సజ్జలకు అప్పగించారు. ఈ బాధ్యతలను సజ్జల, బుగ్గన సంయుక్తంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక ఆ బాధ్యతలతో పాటు ప్రాంతీయ సమన్వయకర్తల, పార్టీ జిల్లా అధ్యక్షుల కో–ఆర్డినేటర్‌గా సజ్జలకు బాధ్యతలు అప్పగించారు. అయితే తాజాగా ఆ బాధ్యతల విషయంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.

ఇక మరోపక్క దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి అయిన జూలై 8న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ కోసం పార్టీ సిద్దమవుతోంది. అప్పటిలోపు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను జిల్లా అధ్యక్షులు సమన్వయం చేసుకుంటూ వైసీపీ గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో, పార్టీని బలోపేతం చేయడంలో ప్రాంతీయ సమన్వయకర్తలు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.