iDreamPost
iDreamPost
తెలుగు న్యూస్ ఛానళ్ల రేటింగ్స్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. సుదీర్ఘకాలం పాటు నిలిచిపోయిన రేటింగ్స్ ఇటీవల మళ్లీ విడుదల చేస్తున్నారు. గతంలో రేటింగ్స్ మ్యానిపులేట్ చేస్తున్నారనే ఆరోపణలపై వాటిని నిలిపివేశారు. బార్క్ రేటింగ్స్ చుట్టూ పెద్ద వివాదాలు, కేసులకు దారితీసిన పరిణామాలు చాలామందికి తెలుసు. ప్రస్తుతం రేటింగ్స్ తిరిగి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆయా ఛానళ్ల రేటింగ్స్ పరిస్థితి ఆసక్తిగా కనిపిస్తోంది.
ఇటీవల తెలుగుమీడియాలో టీవీ9 కొంత వెనుకబడింది. సుదీర్ఘకాలం పాటు తెలుగుమీడియాలో నెంబర్ వన్ గా నిలిచిన ఆ ఛానల్ గడిచిన ఐదు వారాల రేటింగ్స్ లోనూ రెండో స్థానానికే పరిమితమయ్యింది. టీవీ9ని తోసిపుచ్చి ఎన్టీవీ టాప్ లో ఉంది. నిజానికి గతంలో కూడా చాలా సందర్భాల్లో తెలుగు నాట బార్క్ రేటింగ్స్ లో సైతం టీవీ9 ని దాటి కొన్నిసార్లు ఎన్టీవీ, మరికొన్నిసార్లు టీవీ5, వీ6, సాక్షి టీవీ ఇలా అగ్రస్థానాలను అందుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ వరుసగా ఐదువారాల పాటు టీవీ 5 అగ్రస్థానానికి దూరంకావడం మాత్రం ఇదే తొలిసారి.
తెలుగునాట న్యూస్ ఛానళ్ల మధ్య కూడా రేటింగ్స్ కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ పోటీలో పలుమార్లు అడ్డందిడ్డంగానూ వ్యవహరిస్తారు. ప్రజల్లో అభాసుపాలయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా శాటిలైట్ ఛానళ్లు మాత్రం తమకు రేటింగ్స్ మాత్రమే ప్రధానమన్నట్టుగా వ్యవహరించడం ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఛానళ్ల నుంచి తెలుగు న్యూస్ ఛానళ్ల వరకూ అందరిలోనూ కనిపిస్తుంది. అందులో ఏ ఒక్క ఛానల్ కూడా మినహాయింపు కాదనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం 5వారాలుగా విడుదలవుతున్న రేటింగ్స్ ప్రకారం సగటున 73.8 రేటింగ్ పాయింట్లతో ఎన్టీవీ టాప్ లో ఉంది. ఆ తర్వాత టీవీ9 కి 55, వీ6 ఛానల్ కి 30 పాయింట్లు ఉన్నాయి. తదుపరి నాలుగైదు స్థానాల్లో టీవీ5, సాక్షి టీవీ దాదాపు సమానంగా ఉన్నాయి. ఇతర ఛానళ్లు వీటికి అందనంత దూరంలో కనిపిస్తున్నాయి. పచ్చ మీడియాగా ముద్రపడిన ఏబీఎన్ 7, ఈటీవీ ఛానళ్లు 11,12 స్థానాల్లో నిలవడం విశేషం.