iDreamPost
android-app
ios-app

ఆప్ లోకి మాజీ ఎమ్మెల్యే, ఆపార్టీకి ఏపీలో అవకాశం వస్తుందా

  • Published Mar 16, 2022 | 4:46 PM Updated Updated Mar 16, 2022 | 5:53 PM
ఆప్ లోకి మాజీ ఎమ్మెల్యే, ఆపార్టీకి ఏపీలో అవకాశం వస్తుందా

ఆంధ్రప్రదేశ్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీలోకి వలసలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఆప్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని ఆపార్టీ కార్యాలయంలో ఆయన చీపురుపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో టీడీపీ, బీజేపీలలో చేరారు. ఇప్పుడు ఆప్ లో ఆయన చేరిక చర్చనీయాంశం అవుతోంది.

గతంలో చిన్నం రామకోటయ్య నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు. బీజేపీలో చేరారు. బీజేపీ తరపున 2019లో ఏలూరు ఎంపీ స్థానానికి పోటీపడ్డారు. అయినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం విశేషంగా భావించాలి.

ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పుతున్న అరవింద్ కేజ్రీవాల్ పార్టీ తొలిసారిగా ఢిల్లీ ఆవల పంజాబ్ లో పాగా వేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం దక్కించుకుంది. ప్రస్తుతం గుజరాత్ మీద కన్నేసింది. హిమాచల్ ప్రదేశ్ లో కూడా విజయం కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. గోవాలో సైతం ప్రభావం చూపింది. ఇలా వివిధ రాష్ట్రాలకు విస్తరించే లక్ష్యంతో ఆపార్టీ ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కార్యాచరణను కూడా చేపట్టింది.

ఇటీవల తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా కేజ్రీవాల్ ని కలిసే యత్నం చేసినప్పటికీ అది సాధ్యం కాకపోవడానికి తెలుగు రాష్ట్రాల్లో ఆప్ లక్ష్యాల్లో భాగంగానూ చెబుతున్నారు. అయితే రామకోటయ్య ఆప్ లో చేరిక ఏపీలో మధ్యతరగతిలో కూడా ఆప్ పట్ల అంతో ఇంతో ఉన్న సానుభూతిని అందిపుచ్చుకునే లక్ష్యంలో భాగమేనంటున్నారు. ఏపీలో బీజేపీ ఎదుగుదలకు అవకాశాలు లేని తరుణంలో ఆయన ఆప్ లో చేరినట్టు కనిపిస్తోంది. అది ఆప్ కి ఏమేరకు ఉపయోగపడుతుంది, రామకోటయ్య భవితవ్యం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది చూడాల్సి ఉంది.