iDreamPost
android-app
ios-app

బాబు ముందు చాణక్యుడు బలాదూరే!

  • Published Mar 04, 2022 | 7:50 AM Updated Updated Mar 04, 2022 | 11:39 AM
బాబు ముందు చాణక్యుడు బలాదూరే!

అధికారాన్ని చేపట్టడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి నాయకులు ఎలాంటి ఎత్తులువేయాలి అనే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చాణక్యుడికి మించిన తెలివితేటలు ప్రదర్శిస్తారని రాజకీయ పరిశీలకులు అంటారు. ముఖ్యంగా తన ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి ఆయన ఎన్నుకొనే మార్గాలు, అనుసరించే వ్యూహాలు కర్కశంగా, అమానవీయంగా ఉంటాయి. కాకుంటే ఆయన అనుంగు మీడియా దీనిని వ్యూహ చతురతగా, అనితర సాధ్యమైన విద్యగా ప్రజల్లోకి చాలానేర్పుగా తీసుకెళ్లి నమ్మిస్తుంది.

పదే పదే అదే ప్రయోగం..

తన ప్రత్యర్థులను వారి కుటుంబం నుంచి, బంధువుల నుంచి వేరుచేసి, వారే ఆయనపై యుద్ధం చేసేటట్టు చేయడం చంద్రబాబు చాలా ఏళ్లుగా అమలుచేస్తున్న ఫార్ములా. ఆ విధంగా తన ప్రత్యర్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం ఆయన లక్ష్యం. గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై విజయవంతమైన ఈ ఫార్ములాను ఇప్పటికీ ఆయన వాడుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, తన సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడిపై దీనిని వాడి కొంతమేర విజయం సాధించారు కూడా.

ఎన్టీఆర్ పై ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు దైవాంశ సంభూతుడిగా భావించే ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి చంద్రబాబు చాకచక్యంగా మొత్తం కుటుంబ సభ్యులందరినీ ఆయనకు దూరం చేశారు. అందుకు లక్ష్మీపార్వతిని బూచిగా చూపారు. తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం అంటూ పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారు. ఇదంతా ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించిన చంద్రబాబు చేసిన వీరోచిత కార్యంగా అనుంగు మీడియా కీర్తించి, జనాన్ని చాలారోజులపాటు నమ్మించింది.

చిరంజీవిపై పైనా..

ఇటీవల సినీ పరిశ్రమ సమస్యలపై ఆ రంగ ప్రముఖులతో జరిగిన భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి అంత ప్రాథేయపడాలా? అని ప్రశ్నించి చంద్రబాబు తన అక్కసును బయట పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా  ‘వంగి వంగి దణ్ణాలు పెట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కూడా అనిపించారు. ఆ విధంగా సీఎం జగన్‌తో సన్నిహితంగా ఉన్న చిరంజీవిపై తనకున్న ఆగ్రహాన్ని ఆయన సోదరుడితోనే కామెంట్‌ చేయించి చంద్రబాబు చల్లార్చుకున్నారు.

ఎక్కడైనా తమ్ముడు కానీ..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తరచు తనపై విమర్శలు చేసిన సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడిని కుటుంబానికే కాదు మొత్తం జనానికే దూరంగా చేశారు. రామ్మూర్తినాయుడు మాట్లాడితే తన బతుకు మొత్తం బయట పడుతుందనే భయంతో ఆయన గొలుసులతో బంధించి నొరెత్తకుండా చేశారని ఇప్పటికి చంద్రబాబును ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అయితే దీనిపై ఆయన ఎప్పుడూ స్పందించలేదు.

ముఖ్యమంత్రిపై దుష్ప్రచారం..

ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌, ఆయన బాబాయ్‌ వివేకానందరెడ్డి కుటుంబాన్ని వేరు చేసి రాజకీయ క్రీడ మొదలుపెట్టారు. వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ జరుగుతుండగానే సమాంతరంగా పచ్చ పంచాయతీ కొనసాగిస్తూ కేసును ప్రభావితం చేయాలని చూస్తున్నారు. సీఎంపై ఆయన బంధువులతో ఆరోపణలు చేయిస్తున్నారు. దానికి చిలువలు, పలవలు అల్లి తన మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. అదనంగా ముఖ్యమంత్రి తల్లి విజయమ్మ, ఆయన చెల్లి షర్మిల నడుమ విభేదాలు ఉన్నట్టు తన మీడియా ద్వారా తరచుగా ప్రచారం చేయిస్తున్నారు. ఇలా రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి కుటుంబ సభ్యులనే ఆయుధాలుగా వాడొచ్చు అనే ఐడియా అప్పట్లో చాణక్యుడు కూడా సూచించలేదు. అంటే బాబు ముందు చాణక్యుడు బలాదూర్‌ అనేగా అర్థం!