iDreamPost
iDreamPost
తాను ముఖ్యమంత్రిగానే తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసి బయటకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు నిజంగా అంత సీన్ ఉందా? అన్న చర్చ నడుస్తోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు, విభజిత అంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీని బాయ్‌కాట్ చేసి తిరిగి ముఖ‍్యమంత్రులుగానే సభలో అడుగుపెట్టారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 1992లో హైదరాబాద్‌లో టీడీపీ సీనియర్ నాయకుడు శివారెడ్డి హత్య జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ ఈ అంశంపై మాట్లాడడానికి తనకు అవకాశం ఇవ్వాలని అసెంబ్లీలో పదే పదే కోరారు. ఆయినా అందుకు అనుమతి రాకపోవడంతో నిరసనగా ఆయన అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశారు. ఆయన అనుకున్నట్టుగానే 1994 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెట్టారు. అ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
స్పీకర్ నిర్ణయం తీసుకోనందుకు అసెంబ్లీని బహిష్కరించిన జగన్
తమ పార్టీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన వారిపై అనర్హత వేటు వేయని స్పీకర్ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి 2017 అక్టోబర్‌లో అసెంబ్లీని బహిష్కరించారు. అయితే తాను తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను వంటి ప్రతిజ్ఞ ఆయన చేయలేదు. కానీ 2019 ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సాధించి సీఎంగానే జగన్ సభలో అడుగుపెట్టారు. అయితే ఎన్టీఆర్, జగన్ అసెంబ్లీని బాయ్‌కాట్ చేశాక జనంలోకి వెళ్లారు. ప్రజాకోర్టులో అధికారపక్షం తీరును ఎండగట్టి, తమ వాదనను గట్టిగా వినిపించారు. జనామోదంతో ముఖ్యమంత్రులు అయ్యారు.
శపథం చేయడం అవసరమా?
తన భార్యకు అవమానం జరిగిందని, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ అసెంబ్లీని బహిష్కరించిన చంద్రబాబు తిరిగి సీఎంగానే వస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. బయటకు వచ్చి మీడియా సాక్షిగా వెక్కి వెక్కి ఏడ్చారు కూడా. అంతే తప్ప తాను తిరిగి ముఖ్యమంత్రి కావడానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పార్టీని గెలిపించే ప్రయత్నాలు ఏమీ ఇంతవరకు చేయలేదు. పాదయాత్ర చేద్దామా? సైకిల్ యాత్ర చేద్దామా? అన్న డైలమాలోనే ఇంకా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పార్టీకి ఆత్మహత్యాసదృశం అని టీడీపీ నాయకులే అంతర్గత సంభాషణల్లో అంటున్నారు. 2019 ఓటమి తర్వాత వరుసగా జరిగిన పలు ఎన్నికల్లో అపజయాలను మూటగట్టుకున్న టీడీపీని నాయకులు, కార్యకర్తలు వీడి వెళ్లారు. కుప్పంలో మున్సిపాల్టీని ఓడిపోవడంతో ఆ పార్టీ పరువు ఘోరంగా దెబ్బతింది.
క్యాడర్ బేస్డ్ పార్టీగా ఒకప్పుడు మంచి పేరున్న తెలుగుదేశం చంద్రబాబు హయాంలో మీడియా బేస్డ్ పార్టీగా మారిపోయింది. జనంలోకి వెళ్లి ఓట్లు సంపాదించే నాథుడు లేడు. ఒంటరిగా గెలిచే సత్తా లేదు. పొత్తులతో ఏదో విధంగా గట్టెక్కుదామంటే కాలం కలసి రావడంలేదు. వయసు మీద పడింది.వారసుడు లోకేశ్ అందుకోలేక పోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీని బహిష్కరించడమే కాక సీఎంగానే తిరిగి వస్తానంటూ శపథాలు చేయడం అవసరమా? అన్న విమర్శ సొంత పార్టీ వారి నుంచే వినిపిస్తోంది.