Idream media
Idream media
అన్ లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం 100 మందికి మించని రాజకీయ సమావేశాలకు కొన్ని షరతులతో కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో అన్ని చోట్లా గత నాలుగైదు నెలలతో పోల్చుకుంటే రాజకీయ హడావిడి పెరిగింది. పలు పార్టీల నాయకులు మళ్లీ హడావిడి మొదలు పెట్టారు. అనుచరగణంతో తిరగడం ప్రారంభించారు. డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈ హడావిడి కాస్త ఎక్కువగా ఉంది. డివిజన్ లలో స్థానిక రాజకీయ నేతల సందడి కనిపిస్తోంది. ఈ విషయంలో కార్పొరేటర్ టికెట్ల ఆశావాహులు ఇంకొంచెం ఉత్సాహంగా తిరుగుతున్నారు. డివిజన్ లలో ప్రముఖులను కలుసుకోవడం.. పాదయాత్రలు చేయడం.. సమావేశాలు పెట్టడం, ఆ పార్టీ లో నుంచి ఈ పార్టీలోకి.. ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి చేరికలు వంటి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి తార్ మార్..
ప్రస్తుతం డివిజన్ లలో తాము గెలిచే పరిస్థితి లేదని కొందరు టీడీపీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఎందులో అవకాశం ఉంటే అందులోకి చేరేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇదే క్రమంలో ఫతేనగర్ డివిజన్ కు చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్ ముద్దాపురం కృష్ణగౌడ్ బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచీ ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. మొదటి సారిగా ఫతేనగర్ డివిజన్ కు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. మలిదశ ఎన్నికల పొత్తులో భాగంగా ఆ టికెట్ బీజేపీకి కేటాయించడంతో ఆ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. కానీ ఆయన విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయనే బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే మరికొందరు నాయకులు తమ పార్టీలో గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా ఎక్కువ మంది అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అధికారపక్షం దూకుడు
కరోనా కారణంగా ఐదు నెలలుగా స్తబ్దుగా ఉన్న డివిజన్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో మళ్లీ చురుగా తిరుగుతున్నారు. లాక్ డౌన్ కాలంలో కార్పొరేటర్లు ఎవరూ బయటకు రాకపోవడంతో స్వయానా సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా ఎవరికి వారే డివిజన్ లలో ప్రజలను కలుస్తున్నారు. బస్తీ బాట, డివిజన్ అధ్యక్షులతో సమావేశాలు, రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇటీవల కుత్బుల్లాపూర్ తెలుగుదేశం పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఇలా గ్రేటర్ లో ఎన్నికల హడావిడి మొదలైందనే చెప్పొచ్చు.