iDreamPost
android-app
ios-app

జీజీహెచ్‌ నుంచి జైలుకు అచ్చెం నాయుడు

జీజీహెచ్‌ నుంచి జైలుకు అచ్చెం నాయుడు

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయి ఇప్పటి వరకూ గుంటూరు సర్వజన ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెం నాయుడు డిశ్ఛార్జి అయ్యారు. ఆయన్ను పోలీసులు విజయవాడ సబ్‌ జైలుకు తరలించారు. ఇటీవల అచ్చెం నాయుడు మూడు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అచ్చెం నాయుడును రిమాండ్‌ను ఏసీబీ కోర్టు ఈ నెల 10వ తేదీ వరకూ పొడిగించింది. అచ్చెం నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై రేపు శుక్రవారం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది.

జూన్ 13న అరెస్ట్‌ తర్వాత శ్రీకాకుళం నుంచి విజయవాడకు అచ్చెం నాయుడును ఏసీబీ అధికారులు తీసుకొచ్చారు. అంతకు కొన్ని రోజుల ముందు అచ్చెం నాయుడుకు ఫైల్స్‌ ఆపరేషన్‌ జరగడంతో రక్తస్రావం అయింది. ఈ పరిస్థితుల్లో కోర్టు ఆదేశాల మేరకు అచ్చెం నాయుడును పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన జీజీహెచ్‌లోనే ఉంటున్నారు. గాయం తిరగబెట్టడంతో అచ్చెం నాయుడుకు జీజీహెచ్‌ వైద్యులు మళ్లీ ఆపరేషన్‌ చేశారు. ఆ గాయం మానిందని ఇటీవల జీజీహెచ్‌ వైద్యులు వెల్లడించారు. అయితే నడుం నొప్పి, విరేచనాలు అవుతున్నాయని అచ్చెం నాయుడు చెప్పడంతో మరికొన్ని రోజులు వేచి చూశారు. అవి కూడా నియంత్రణలోకి రావడంతో ఈ రోజు ఆస్పత్రి నుంచి విజయవాడ సబ్‌ జైలుకు అచ్చెం నాయుడును తరలించారు.

అంతకుముందు అచ్చెన్నాయుడు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. తనకు కరోనా టెస్ట్ చేయాలని కోరారు. కొలనోస్కోపి పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదని, కరోనా పరీక్ష చేయకుండా జైలు అధికారులు అనుమతించరని తెలిపారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాతే డిశ్చార్జ్ చేయాలని లేఖలో అచ్చెన్న విజ్ఞప్తి చేశారు.