Idream media
Idream media
కరోనాకి మందు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు కానీ, వికాస్ దూబే ఎన్‌కౌంటర్ జరుగుతుందని, దేశంలోని ప్రజలందరికీ తెలుసు. పోలీసులకి యాక్షనే తప్ప క్రియేటివిటీ ఉండదు. ఆవు వ్యాసంలా ఒకటే కథ. వాహనం బోల్తా, ఆయుధం లాక్కుని తప్పించుకుని పారిపోతున్న నేరస్తుడు, ఆత్మరక్షణ కోసం కాల్చివేత.
దూబే ఎన్‌కౌంటర్ గురించి చదువుతుంటే 21 ఏళ్ల క్రితం రేణిగుంట దగ్గర మామండూరు అడవిలో జరిగిన నరహంతకుల ఎన్‌కౌంటర్ గుర్తుకొచ్చింది. వాళ్లు 42 మందిని హత్య చేశారు. పసిపిల్లల్ని కూడా వదల్లేదు. ఎన్‌కౌంటర్ జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు సమాచారం ఇస్తే జర్నలిస్టుగా అక్కడికి వెళ్లాను.
పోలీస్ వ్యాన్ రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. చేతులకి, కాళ్లకి బేడీలు ఉన్నప్పటికీ హంతకులు అడవిలోకి పారిపోయారు. పోతూపోతూ ఒక SI రివాల్వర్ కూడా లాక్కెళ్లారు. తప్పనిసరిగా కాల్చేశారు.
తమిళ యాసతో ఒక రిజర్వ్ SI సంఘటనను వివరించాడు. ఎక్కువ ప్రశ్నలేస్తే జర్నలిస్టులని కూడా ఎన్‌కౌంటర్ చేసేలా ఉన్నాడు. అందరికీ తెలుసు అడవిలోకి తీసుకెళ్లి వాళ్లని కాల్చేశారని. కానీ ఎవరూ రాయలేదు. పోలీసులు చెప్పిందే రాశారు. ఎందుకంటే చనిపోయింది నరహంతకులు. వాళ్లు చనిపోవాలనే సమాజం కోరుకుంది. దూబే పరిస్థితి కూడా ఇదే. ఒకవేళ సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉంటే దూబే బతికేవాడా? తెలియదు.
దూబేని తయారు చేసేది రాజకీయ నాయకులే. ఫినీష్ చేసేది కూడా వాళ్లే. 8 మంది పోలీసుల్ని కాల్చి చంపే ధైర్యం వచ్చిందంటే దాని వెనుక ఎన్నో ఏళ్ల నేరం, శిక్ష పడదనే ధీమా ఉన్నాయి. యోగి పాలించే రాష్ట్రం రోగగ్రస్తమై ఉంది. అదే విషాదం.