iDreamPost
android-app
ios-app

ఏపీలో పోలీసులకు సొంత గూడు

ఏపీలో పోలీసులకు సొంత గూడు

పదవీ విరమణ చేసే నాటికి పోలీసులకు సొంత గూడు కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఆదేశించారు. ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ పీవీ సునీల్‌కుమార్‌ నేతృత్వంలో 15 మంది పోలీసు అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ బృందం ఇప్పటికే తమిళనాడు వెళ్లి అక్కడ పోలీస్‌ హౌసింగ్‌ స్కీమ్‌ అమలవుతున్న తీరును అధ్యయనం చేసింది. ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే రాష్ట్రంలో దాదాపు 65 వేల పోలీస్‌ కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతుంది. 

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తమిళనాడులో ప్రత్యేకంగా పోలీస్‌ హౌసింగ్‌ స్కీమ్‌ అమలవుతోంది. ‘వోన్‌ యువర్‌ హౌస్‌’ అనే పేరుతో ఈ పథకాన్ని జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ అమల్లోకి తెచ్చారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ స్కీమ్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వమే నేరుగా స్థల సేకరణ చేసి పోలీసులకు ఇల్లు కట్టిస్తోంది. ఇందుకు ప్రభుత్వ నిధులను వినియోగించడంతోపాటు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటోంది. పోలీసులకు ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ)ను మినహాయించి ఈ మొత్తానికి ప్రభుత్వం కొంత కలిపి నెలవారీ వాయిదాలు చెల్లిస్తోంది. పోలీసులు ఇలా నెలవారీ వాయిదాలు చెల్లించిన అనంతరం పదవీ విరమణ నాటికి ఆ ఇల్లు వారి సొంతమవుతుంది.