iDreamPost
android-app
ios-app

మాజీ మంత్రి సోమిరెడ్డిపై చీటింగ్‌కేసు.. అరెస్ట్‌ తప్పదా..?

మాజీ మంత్రి సోమిరెడ్డిపై చీటింగ్‌కేసు.. అరెస్ట్‌ తప్పదా..?

రాజకీయ ప్రత్యర్థులపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేసే మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తులపై బాగా పని చేస్తుందనే ప్రచారం పొందిన కృష్ణపట్నం ఆనందయ్య మందు, దాని విక్రయ అంశాలను ఆధారంగా చేసుకుని.. తన రాజకీయ ప్రత్యర్థి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డిపై సోమిరెడ్డి శనివారం అవినీతి ఆరోపణలు చేశారు.

ఆనందయ్య మందును ఆన్‌లైన్‌ విక్రయిస్తామనే వెబ్‌సైట్‌ను శశ్రిత టెక్నాలజీస్‌ అనే సంస్థ ఏర్పాటు చేసిందని, కోటి మందికి ఆనందయ్య మందు ప్యాకెట్‌ 167 రూపాయల చొప్పన విక్రయించి.. దాదాపు 120 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకునేందుకు ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి ప్లాన్‌ చేశారంటూ సోమిరెడ్డి ఆరోపించారు. ఐదు కోట్ల మందికి ఈ మందు విక్రయిస్తే.. 600 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పుకొచ్చారు. శశ్రిత టెక్నాలజీ నిర్వాహకులు.. ఎమ్మెల్యే కాకాణì కనుసన్నల్లో పని చేస్తున్నారంటూ పేర్కొన్న సోమిరెడ్డి.. వారి ద్వారా కాకాణి ఈ దందాకు తెరలేపారంటూ ఆరోపణలు చేశారు.

అయితే ఈ ఆరోపణలు తిప్పికొట్టిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి.. ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సోమిరెడ్డికి సవాల్‌ విసిరారు. నిరాధారామైన ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బంగడుపుకుంటున్నారని మండిపడ్డారు.

తమ సంస్థ పేరును దెబ్బతీసేలా ఆరోపణలు చేసిన సోమిరెడ్డిపై శశ్రిత టెక్నాలజీ యాజమాన్యం చట్టపరమైన చర్యలకు పూనుకుంది. తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన సోమిరెడ్డిపై శశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదకుమార్‌ కృష్ణపట్నం పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నర్మదకుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు.. సోమిరెడ్డిపై చీటింగ్, దొంగతనం, ఫోర్జరీ అభియోగాలతో కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కింద కూడా కేసు నమోదైంది. ఈ కేసులు వల్ల సోమిరెడ్డికి కొత్త చిక్కులు ఎదురుకానున్నాయి. ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తారనే ప్రచారం సాగుతోంది. ఏ క్షణానైనా సోమిరెడ్డి అరెస్ట్‌ కావచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.