iDreamPost
iDreamPost
జీఎస్టీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోడీ గొంతు విప్పారు. ప్రభుత్వాలు డిమాండ్లను పరిష్కరించే దాకా జీఎస్టీ కట్టొద్దని వ్యాపారులకు ఆయన సూచించారు. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడైన ప్రహ్లాద్ మోడీ.. పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.
మహారాష్ట్రలోని థానెలో జరిగిన ట్రేడర్ల సదస్సులో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మన సందేశాన్ని పంపేందుకు ఆందోళన చేపట్టండి. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ప్రధాని నరేంద్ర మోడీ మన ఇంటి ముందుకే వస్తారు’’ అని చెప్పారు. డిమాండ్లు నెరవేరే దాకా జీఎస్టీ చెల్లించొద్దని వ్యాపారులకు పిలుపునిచ్చారు. ‘‘నరేంద్ర మోడీ కావచ్చు.. మరొకరు కావచ్చు.. ఎవరైనా సరే ముందు మీ సమస్యలు వినాలి.. ఈ రోజు మీకు చెబుతున్నా. జీఎస్టీ చెల్లించబోమని ముందు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. బానిసలం కాదు’’ అని ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
గతంలో కూడా..
2001లో ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్స్ అసోసియేషన్ ఏర్పాటయ్యింది. అప్పటి నుంచి ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ప్రహ్లాద్ మోడీ కొనసాగుతున్నారు. దేశంలోని 6.50 లక్షల ఫెయిర్ ప్రైస్ షాప్ ఓనర్లకు ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్స్ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీకి క్లోజ్‌గా ఉండే తమ్ముడని చెబుతారు. గతంలో అహ్మదాబాద్‌లో రేషన్ షాపును నిర్వహించారు. తన వయసు రీత్యా ఆ పనిని వదులుకున్నారు. ప్రస్తుతం అసోసియేషన్ తరఫున పని చేస్తున్న ప్రహ్లాద్.. గుజరాత్‌లో కూడా వ్యాపారుల నిరసనలకు మద్దతు తెలిపారు.
Also Read : లోక్ సభ సీట్లు పెరుగుతాయా.. ప్రభుత్వం ఏం ఆశిస్తోంది..?
మరోవైపు గత ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు చిన్న మోడీ. గూండాగిరీ చెల్లదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ఎయిర్‌పోర్టులో ధర్నా చేశారు. తనను కలిసేందుకు వచ్చిన మద్దతుదారులను పోలీసులు అడ్డుకుని ఆరెస్టు చేశారన్న కారణంతో అక్కడే బైఠాయించి ప్రహ్లాద్ మోడీ ఆందోళనకు దిగారు. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆర్డర్స్ ఉన్నాయని పోలీసులు చెప్పడంతో ఫైర్ అయ్యారు. ‘‘పీఎంవో నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కదా.. చూపించండి. ఇక్కడి ప్రభుత్వానికి కానీ, ప్రధాన మంత్రి కార్యాలయానికి గూండాగిరీ సరి కాదు. పీఎంవో ఆర్డర్ కాపీని ఇవ్వకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా” అని హెచ్చరించారు. గంటన్నరపాటు అక్కడే ధర్నా చేసిన ఆయన తర్వాత వెళ్లిపోయారు.
జీఎస్టీ.. జేబులు గుల్ల
ఒక దేశం.. ఒకే పన్ను పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థ.. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ). 2017 జులై 1 నుంచి దేశంలో అమల్లోకి వచ్చింది. ఏదైనా పథకం ప్రారంభిస్తే.. ప్రజలకు మేలు జరగాలి. కానీ జీఎస్టీ వచ్చాక.. రకరకాల శ్లాబులు.. ఎందుకు ఏ పన్ను వేస్తున్నారో సాధారణ ప్రజలకు అర్థం కాని పరిస్థితి. అమ్మాయిలకు అత్యవసరమైన శానిటరీ ప్యాడ్స్ పైన అత్యధిక పన్ను విధించారు. సెకండ్ వేవ్‌లో ఎన్నో ప్రాణాలను కాపాడిన అత్యవసర మెడికల్ పరికరాలపై జీఎస్టీ వసూలు చేశారు. జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి లాభాలు తప్ప.. ప్రజల జేబులకు చిల్లు పడిందనేది నాలుగేళ్లుగా వినిపిస్తున్నమాట. చిన్న వ్యాపారులకు కూడా జీఎస్టీ వల్ల పెద్ద దెబ్బే పడింది. ఈ విషయాన్ని స్వయానా ప్రధాని మోడీ కూడా అంగీకరించారు. జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులకు నష్టం కలిగిందనేది నిజమేనన్నారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ ప్రతిపక్షాలు ఇప్పటికీ విమర్శిస్తున్నాయి.
Also Read : మోదీని కలిసే ముందు మమత షాకింగ్ డెసిషన్