Idream media
Idream media
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి కరోనా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు మోడీ ఫోన్ చేశారు. కరోనా తీవ్రత, కట్టడిని చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. అలాగే వైరస్‌ను నివారించుటకు పలు సూచనలు, సలహాలు సైతం చేశారు.
మరోవైపు వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న బీహార్, అస్సాం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సిఎంలతో ప్రధాని ముచ్చటించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనా పరీక్షలను రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు మోడీ అభినందనలు తెలిపారు. కాగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618కి చేరింది. దీంతో పలు రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్ మంత్రాన్ని పాటిస్తున్నాయి.
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన వారంరోజులుగా నిత్యం 30వేలకుపైగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే కొత్తగా 38,902 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దేశంలో ఒక్కరోజే ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడిన వారిసంఖ్య 10,77,618కు చేరింది. నిన్న ఒక్కరోజే మరో 543మంది కరోనా రోగులు ప్రాణాలువిడిచారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 26,816కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 6,77,422 మంది కోలుకోగా, మరో 3,73,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63శాతంగా ఉంది.
గడిచిన వారం రోజులుగా దేశంలో కరోనా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత ఆదివారం దేశంలో కరోనా మరణాల సంఖ్య 22,674గా ఉండగా ప్రస్తుతం అది 26,816కు చేరింది. దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 500 మందికి పైగా కరోనా రోగులు మృతి చెందుతున్నారు. దీంతో ఈ వారం రోజుల్లోనే 4,142 మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నిత్యం అక్కడ 70వేల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో ప్రస్తుతం భారత్ కొనసాగుతోంది. భారత్‌లో రోజువారీ కేసుల సంఖ్య 39వేలకు చేరువవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక అత్యధిక కరోనా కేసుల జాబితాలో 37లక్షలతో అమెరికా తొలిస్థానంలో ఉండగా భారత్ మూడోస్థానంలో కొనసాగుతోంది. మరణాల్లో మాత్రం భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది.