జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ వైరస్ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు సూచిస్తూ.. సున్నితంగా హెచ్చరించారు. మాస్కులు పెట్టుకోని వారికి ఫైన్ లు విధించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపారు.గ్రామీణుడికైనా, దేశ ప్రధానికైనా నిబంధనలు ఒకేలా ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. మాస్కు ధరించనందుకు ఓ ప్రధానికి కూడా రూ. 13000 ఫైన్ వేశారంటూ ప్రస్తావించారు. దీంతో ఎవరా.. ప్రధాని..? అనేది అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇంతకీ ఆయన ఎవరంటే.. పేరు బోయ్కో బొరిస్సోవ్. బల్గేరియా ప్రధాని. యూరఫ్ ఖండంలోని ఓ దేశం బల్గేరియా. కరోనా విజృంభణతో ప్రపంచంలోని అన్ని దేశాలూ కకావికలం అవుతున్నాయి. ఆ దేశాన్ని కూడా మహమ్మారి భయపెట్టింది. వైరస్ నియంత్రణకు అక్కడ నిబంధనలు మరింత కఠినం చేశారు. భౌతిక దూరం పాటించకపోయినా… మాస్కు ధరించకపోయినా జరిమానాలు విధించేందుకు ప్రత్యేక టీమ్ ను నియమించారు.
ఆ దేశ ప్రధాని బోయ్కో బొరిస్సోవ్ కొద్ది రోజుల క్రితం ఓ చర్చిని సందర్శించేందుకు వెళ్లారు. మాస్కు పెట్టుకోవడం మరిచిపోయారు. ఇది గుర్తించిన అక్కడి అధికారులు ఆయనకు భారీ జరిమానా విధించారు. ఆ దేశ కరెన్సీ ప్రకారం 300 లెవ్స్ ఫైన్ వేశారు. అంటే మన కరెన్సీ ప్రకారం 13000 రూపాయలన్నమాట. ఆయనకే కాదు.. మాస్కు పెట్టుకోకుండా కూడా ఉన్న కొంత మంది సిబ్బందికి, మీడియా సిబ్బందికి కూడా జరిమానా విధించారు. అలాగే.. ఇటీవల అధికార, ప్రతిపక్ష పార్టీలు భారీ సమావేశాలు నిర్వహించాయి. అక్కడ భౌతిక దూరం నిబంధనను పాటించ లేదు. దీంతో ఆయా పార్టీలకు చెరో మూడు వేల లెవ్ లు అంటే 1, 30, 228 రూపాయల జరిమానా విధించారు.
నిబంధనలను కఠినంగా అమలు చేయడం తో ఆ దేశం కరోనాపై పట్టు సాధించింది. వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగింది. ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు చిన్న, పెద్దా తారతమ్యం లేకుండా నిబంధనలు ఎవరు అతిక్రిమించినా.. చర్యలు చేపట్టడంతో మార్పు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ ఆ దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల 4000 లోపే.